డిఆర్‌డిఓ ఆక్సిజన్‌ కు పిఎం కేర్స్‌ నుంచి రూ.322.5 కోట్లు 

ఢిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డిఆర్‌డిఓ) అభివృద్ధి చేసిన ఆక్సిజన్‌ సరఫరా వ్యవస్థకు పిఎం కేర్స్‌ నుంచి రూ.322.5 కోట్లను కేంద్రం కేటాయించింది. మిత్రదేశాల నుంచి యుద్ధ నౌకలు, విమానాల ద్వారా ఆక్సిజన్‌ అత్యవసర సరఫరా చేసేందుకు 1.5 లక్ష యూనిట్లు ఆక్సికేర్‌ వ్యవస్థను రూ.322.5 కోట్ల వ్యయంతో డిఆర్‌డిఓ అభివృద్ధి చేసింది. 

ఈ ఆక్సికేర్‌ వ్యవస్థను బెంగళూరులోని డిఆర్‌డిఓకు చెందిన ఢిఫెన్స్‌ బయో ఇంజనీరింగ్‌ అండ్‌ ఎలక్ట్రో మెడికల్‌ లేబరేటరీ (డిఇబిఇఎల్‌) అభివృద్ధి చేసింది. ఈ వ్యవస్థ మాన్యువల్‌, ఆటోమోటిక్‌ అనే రెండు రకాలుగా ఉంటుందని డిఆర్‌డిఓ తెలిపింది. 

‘ఎస్‌పిఓ2 స్థాయిల ఆధారంగా ఈ ఆక్సికేర్‌ వ్యవస్థ అనుబంధ ఆక్సిజన్‌ను అందిస్తుంది. ప్రాణాంకతమై హైపోక్సియా స్థితికి రోగి చేరకోకుండా నిరోధిస్తుంది’ తెలిపింది. లక్ష మాన్యువల్‌, 50,000 ఆటోమేటిక్‌ ఆక్సికేర్‌ వ్యవస్థలతో పాటు నాన్‌-రీబ్రీథర్‌ మాస్క్‌(ఎన్‌ఆర్‌బిఎం)లను కూడా డిఆర్‌డిఒ అభివృద్ధి చేసింది.

భారత నౌకదళం ప్రారంభించిన సముద్ర సేతు 2 ఆపరేషన్‌లో భాగంగా ఐఎన్‌ఎస్‌ తర్కాష్‌ ఒక్కొక్కదానిలోనూ 20 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ నింపివున్న 230 ఆక్సిజన్‌ సిలెండర్లతో ముంబయికి చేరుకుంది. ఫ్రాన్స్‌ను నుంచి ఈ ఆక్సిజన్‌ను మహారాష్ట్ర ప్రభుత్వానికి అందించినట్లు నేవీ అధికారులు తెలిపారు.

మంగళవారం మంగళూరు పోర్టుకు కువైట్‌ నుంచి 100 మెట్రిక్‌ టన్నుల లిక్విడ్‌ ఆక్సిజన్‌, 1200 ఆక్సిజన్‌ సిలెండర్లుతో ఐఎన్‌ఎస్‌ కోచి, ఐఎన్‌ఎస్‌ తబర్‌ చేరుకున్నాయి. భారత వాయుదళం కూడా ఈ ఆక్సిజన్‌ సరఫరాలో పాలుపంచుకుంటుంది. 

బుధవారం నాటికి 403 కంటైనర్లలో 6,856 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలించింది. వివిధ దేశాల నుంచి బుధవారం ఒక్కరోజే 793 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను తీసుకొచ్చింది.