సీఎం అవుతానని 30 ఏళ్ల క్రితమే చెప్పాడు

మీ అమ్మ‌కు చెప్పు.. ఏదో ఒక రోజు నేను సీఎం అవుతా.. క‌చ్చితంగా సీఎం అయి చూపిస్తా.. అని 30 ఏండ్ల క్రితం చెప్పిన ఓ వ్యక్తి.. ఇప్పుడు నిజంగానే ముఖ్య‌మంత్రి అయ్యారు. తన భార్య‌కు ఆనాడు చెప్పిన‌ట్లే ఇవ్వాల సీఎం అయ్యారు. ఆయ‌న ఎవ‌రో కాదు.. అసోం ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన హిమంత బిష్వ శ‌ర్మ‌.

గువాహ‌టిలోని కాట‌న్ కాలేజీలో చ‌దువుతున్న రోజుల్లో హిమంత బిష్వ శ‌ర్మ వ‌య‌సు 22 ఏండ్లు. ఆయ‌న తోటి విద్యార్థిని అయిన రినికి భుయాన్‌కు 17 ఏండ్లు. త‌న‌తో క‌లిసి చ‌దువుకున్న రినికి అంటే హిమంత‌కు ప్రేమ‌. ఏదో ఒక రోజు ముఖ్య‌మంత్రిని అవుతాను. ఈ విష‌యం మీ అమ్మ‌తో చెప్పు అని ఆరోజుల్లోనే త‌న‌తో చెప్పాడంట హిమంత‌.

ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణం చేసిన అనంత‌రం గువాహ‌టిలో జ‌రిగిన స‌న్మాన స‌భ‌లో హిమంత బిష్వ శ‌ర్మ మాట్లాడుతూ గ‌త స్మృతుల‌ను నెమ‌రేసుకున్నారు. 30 ఏండ్ల క్రితం నా భార్య‌తో చెప్పిన‌ట్లుగా ఇవ్వాల ముఖ్య‌మంత్రి అయ్యాను, ఇంత‌క‌న్నా కావాల్సిందేముంది.. అని సంతోషం ప్రకటించారు.  ఆయ‌న ఎమ్మెల్యేగా ఉన్న స‌మ‌యంలోనే తమ పెండ్లి జ‌రిగిందని, ఆ త‌ర్వాత మంత్రి అయ్యార‌ని హిమంత బిష్వ శ‌ర్మ శ్రీ‌మ‌తి గుర్తుచేసుకున్నారు. ఇన్నాళ్లు రాజ‌కీయాల్లో ఎలా నెగ్గుకొస్తున్నాడో ప్ర‌త్య‌క్షంగా చూస్తున్నాన‌ని, ఈ స్థాయికి రావ‌డానికి ఎంతో క‌ష్ట‌ప‌డ్డార‌ని రినికి చెప్పారు.

‘‘ 30 ఏళ్ల క్రితమే హిమంత తన రాజకీయ భవిష్యత్‌ ఎలా ఉండబోతుంది. ఎలాంటి పదవి బాధ్యతలు చేపడతారో నాకు చెప్పారు. 23 ఏళ్ల వయస్సులో నాతో చెప్పిన మాటలు ఇప్పుడు నిజమయ్యాయి. ఈ ఆనంద సమయాలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి’’ అని ఆమె చెప్పుకొచ్చారు. కాలేజీ చ‌దువుకునే రోజుల్లోనే హిమంత రాజ‌కీయాల్లో చురుకుగా ఉండేవారు. ఆల్ అసోం స్టూడెంట్స్ యూనియ‌న్‌లో చేరి అనేక సంవ‌త్స‌రాలు ప‌నిచేశారు. అనంత‌రం 1994 లో ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. 2001 లో తొలిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు.