నేపాల్ లో విశ్వాస‌ప‌రీక్ష‌లో కూలిన ఓలీ ప్రభుత్వం 

నేపాల్ ప్ర‌ధాని కేపీ శ‌ర్మ ఓలి ఆ దేశ పార్ల‌మెంట్ విశ్వాసం కోల్పోయారు. నేపాల్ పార్ల‌మెంట్‌లో ఇవాళ జ‌రిగిన విశ్వాస ప‌రీక్ష‌లో ఓలీకి అనుకూలంగా 93 ఓట్లు, వ్య‌తిరేకంగా 124 ఓట్లు వ‌చ్చాయి. మ‌రో 15 మంది స‌భ్యులు ఓటింగ్‌లో పాల్గొన‌కుండా న్యూట్ర‌ల్‌గా ఉన్నారు. 

నేపాల్‌ పార్లమెంట్‌లో ప్రస్తుతం 271 మంది ఎంపీలు ఉన్నారు. ఓలి ప్రభుత్వం విశ్వాస పరీక్ష‌ నుంచి గట్టెక్కాలంటే కనీసం136 మంది ఎంపీల మద్దతు అవసర కాగా సీపీఎన్‌-యూఎంఎల్‌కు 121 మంది సభ్యులు ఉన్నారు. 

అయితే పుష్పకమల్‌ దహల్‌ (ప్రచండ) నేతృత్వంలోని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ నేపాల్‌ మద్దతు ఉపసంహరించుకుంది. ఓలి తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి మరో 15 మంది మద్దతు అవసరం ఉండగా మద్దతు కూడగట్టుకోవడంలో ఓలి విఫలమయ్యారు. దీంతో పార్లమెంట్‌ విశ్వాసాన్ని కోల్పోయారు. 

సోమవారం సాయంత్రం 5 గంట‌లకు స‌భ ప్రారంభం కాగానే.. ప్ర‌ధాని ఓలి విశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెట్టారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన ఓలి దేశ ప్ర‌ధానిగా తాను చేసిన కృషి, సాధించిన ల‌క్ష్యాలు త‌దిత‌ర అంశాల‌ను స‌భ‌కు వివ‌రించారు.

అనంత‌రం ప్ర‌ధాని ప్ర‌తిప‌క్ష పార్టీ అయిన నేపాలీ కాంగ్రెస్ అధ్య‌క్షుడు షేర్ బ‌హ‌దూర్ దేవుబా, క‌మ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ చైర్‌ప‌ర్స‌న్ పుష్ప‌క‌మ‌ల్ ద‌హ‌ల్ విశ్వాస తీర్మానానికి వ్య‌తిరేకంగా త‌మ వాద‌న‌లు వినిపించారు. అదేవిధంగా జ‌న‌తా సమాజ్‌వాది పార్టీ నేత‌లు మ‌హతో ఠాకూర్‌, ఉపేంద్ర యాద‌వ్ కూడా తీర్మానంపై చ‌ర్చ‌లో పాల్గొన్నారు.

అన్ని పార్టీల స‌భాప‌క్ష నేత‌లు మాట్లాడిన అనంత‌రం స్పీక‌ర్ విశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వ‌హించారు. అయితే మెజారిటీ స‌భ్యులు వ్య‌తిరేకంగా ఓటు వేయ‌డంతో ఓలి విశ్వాస తీర్మానం వీగిపోయింది. 

కాగా, గ‌తంలో పుష్ప‌క‌మ‌ల్ ద‌హ‌ల్ (ప్ర‌చండ‌) నేతృత్వంలోని క‌మ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ మ‌ద్ద‌తుతో కేపీ శ‌ర్మీ ఓలి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే, కొన్ని నెల‌ల క్రితం ప్ర‌చండ పార్టీ మ‌ద్ద‌తు ఉప‌సంహ‌రించుకోవ‌డంతో ఓలి స‌ర్కారు మైనారిటీలో ప‌డింది. ఈ నేప‌థ్యంలో విశ్వాస‌ప‌రీక్ష జ‌రిగింది.