చైనా తీరుపై మండిపడ్డ నాసా!

ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన చైనా రాకెట్‌ భారీ శకలం ఆదివారం తెల్లవారుజామున మాల్దీవుల సమీపంలో హిందూ మహాసముద్రంలో  కూలడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. కాగా చైనా తీరుపై అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తీవ్రంగా మండిపడింది.
చైనా అంత‌రిక్ష శకలాల విష‌యంలో బాధ్యతారహితంగా ప్రవర్తించిందని అంతేకాకుండా అంతరిక్ష ప్రయోగ ప్రమాణాలను పాటించడంలో చైనా ఘోరంగా విఫలమైందని పేర్కొంది. చైనా అతిపెద్ద రాకెట్ లాంగ్ మార్చ్ 5బీ నియంత్రణ కోల్పోయి స‌ముద్రంలో కూలిపోయిన కొద్దిసేపటికే నాసా స్పందించింది. 
చైనా స్పేస్ ప్రోగ్రామ్‌పై నాసా అడ్మినిస్ట్రేటర్‌ బిల్‌ నెల్సన్‌ మాట్లాడుతూ   అంతరిక్ష ప్రయోగాలపై చైనా అనుసరిస్తున్న తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతరిక్ష ప్రయోగాలను చేసే దేశాలు కచ్చితంగా స్పేస్‌ డెబ్రిస్‌(శకలాలు)పై బాధ్యతవహించాలని తెలిపారు.
రాకెట్‌ ప్రయోగానికి సంబంధించిన శకలాలు నియంత్రణ కోల్పోయి భూ వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు,  భూమిపై ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూసుకోవాలని హితవు పలికారు. చైనా ప్రయోగించే అంతరిక్ష ప్రయోగాలపై పారదర్శకత ఉండేలా చూసుకొవాలని సూచించారు.

అంత‌రిక్షంపై క‌న్నేసిన దేశాలు వాళ్ల స్పేస్ ఆబ్జెక్ట్స్ తిరిగి భూవాతావ‌ర‌ణంలోకి ప్ర‌వేశిస్తున్న‌ప్పుడు భూమిపై ఉన్న ప్ర‌జ‌లు, వాళ్ల ఆస్తుల‌కు ముప్పు క‌ల‌గ‌కుండా చూడాలని పేర్కొన్నారు. ఈ ఆప‌రేష‌న్ల‌లో పార‌ద‌ర్శ‌క‌త‌ను పెంచాలి అని నెల్స‌న్  స్ప‌ష్టం చేశారు. అంత‌రిక్ష కార్య‌క‌లాపాల‌ను సుదీర్ఘ కాలం కొన‌సాగించ‌డానికి, భ‌ద్ర‌త‌, స్థిర‌త్వం క‌ల్పించ‌డానికి చైనా స‌హా అన్ని దేశాలు బాధ్య‌త‌గా, పార‌ద‌ర్శ‌కంగా వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు.

గ‌త నెల 29న చైనా లాంచ్ చేసిన ఈ రాకెట్‌.. 100 అడుగుల పొడ‌వు, 22 మెట్రిక్ ట‌న్నుల బ‌రువు ఉంది. ఇది నియంత్ర‌ణ కోల్పోవ‌డంతో భూమిపై ఉన్న జ‌నావాసాల‌పై ఎక్క‌డ కూలుతుందో అన్న ఆందోళ‌న క‌లిగింది.