ఏపీకి రూ.387 కోట్లు, తెలంగాణకు రూ.273 కోట్లు

ఏపీకి రూ.387 కోట్లు, తెలంగాణకు రూ.273 కోట్లు

కొవిడ్‌ మహమ్మారి విజృంభణ నేపథ్యంలో దేశంలోని 25 రాష్ట్రాల గ్రామీణ స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం  రూ.8,923.8 కోట్లను గ్రాంటు రూపంలో విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫారసులకు లోబడి గ్రామ పంచాయతీ, బ్లాక్‌, జిల్లా మొదలైన పంచాయతీరాజ్‌ గ్రామీణ స్థానిక సంస్థల కోసం ఈ నిధులు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. 

కొవిడ్‌ మహమ్మారి విజృంభణను దృష్టిలో పెట్టుకుని 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి విడత గ్రాంటుగా ఈ నిధులు విడుదల చేసినట్లు పేర్కొంది. ఈ నిధులను కొవిడ్‌ మహమ్మారి కట్టడికి అవసరమైన చర్యలు చేపట్టేందుకు ఖర్చు చేయాలని సూచించింది. 

15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు తొలి విడత గ్రాంటును వచ్చే జూన్‌లో విడుదల చేయాల్సి ఉండగా… కరోనా మహమ్మారి ఉధృతి నేపథ్యంలో షెడ్యూల్‌కు ముందుగానే నిధులు విడుదల చేసినట్టు పేర్కొంది. ఈ నిధుల్లో ఆంధ్రప్రదేశ్‌కు రూ.387.8 కోట్లు, తెలంగాణకు రూ.273 కోట్లు విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది.

అరుణాచల్‌ప్రదేశ్‌కు రూ.34 కోట్లు, అసోంకు రూ.237.2కోట్లు, బిహార్‌కు రూ.741.8 కోట్లు, ఛత్తీ్‌సగఢ్‌కు రూ.215 కోట్లు, గుజరాత్‌కు రూ.472.4 కోట్లు, హరియాణాకు రూ.187కోట్లు, హిమాచల్‌ప్రదేశ్‌కు రూ.63.4కోట్లు, జార్ఖండ్‌కు రూ.249.8 కోట్లు, కర్ణాటకకు రూ.475.4 కోట్లు, కేరళకు రూ.24.6కోట్లు, మధ్యప్రదేశ్‌కు రూ.588.8 కోట్లు, మహారాష్ట్రకు రూ.861.4కోట్లు విడుదల చేసింది.

అదే విధంగా, మణిపూర్‌కు రూ.26.2కోట్లు, మిజోరాంకు రూ.13.8 కోట్లు, ఒడిశాకు రూ.333.8కోట్లు, పంజాబ్‌కు రూ.205.2 కోట్లు, రాజస్థాన్‌కు రూ.570.8 కోట్లు, సిక్కింకు రూ.6.2కోట్లు, తమిళనాడుకు రూ.533.2కోట్లు, త్రిపురకు 28.2 కోట్లు, ఉత్తరప్రదేశ్‌కు రూ.1,441.6కోట్లు, ఉత్తరాఖండ్‌కు రూ.85 కోట్లు, పశ్చిమబెంగాల్‌కు రూ.652.2 కోట్ల మేర  కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ వివరించింది.