కరోనాతో ప్లాస్టిక్, స్టీల్ పరిశ్రమలపై పిడుగు 

గతేడాది లాక్‌డౌన్‌ ప్రభావం నుంచి పూర్తిగా కోలుకోకముందే పరిశ్రమలపై మరోసారి కరోనా ప్రభావం పడింది. పెరుగుతున్న కరోనా కేసులు, మళ్లీ లాక్‌డౌన్‌ వస్తుందనే భయంతో ఇతర రాష్ట్రాల  కార్మికులు క్రమంగా సొంతూళ్లకు పయనమవుతుండగా  ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు నిలిచిపోవడంతో ముడిసరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. 

వాస్తవానికి గతేడాది మార్చిలో మొదలైన లాక్‌డౌన్‌ నుంచే పరిశ్రమలు ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నది.  మూలిగే నక్కపై తాటిపండు పడినట్టుగా మళ్లీ నెలరోజులుగా కరోనా ఉగ్రరూపంతో పరిశ్రమ వర్గాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. ఇప్పటికే ప్లాస్టిక్‌ ధరలు ఇప్పటికే రెట్టింపు కాగా, సిమెంట్‌, స్టీల్‌ రేట్లు కూడా భారీగా పెరిగాయి.

ప్లాస్టిక్‌ పరిశ్రమలకు గుజరాత్‌, మహారాష్ట్రలోని రిలయన్స్‌, గెయిల్‌ సంస్థలనుంచే ఎక్కువగా ముడిసరుకు దిగుమతి అవుతున్నది. ఆ రెండు రాష్ట్రల్లో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో కార్మికులు స్వరాష్ట్రాల బాట పట్టారు. దీంతో ఉత్పత్తి తగ్గడం, రవాణా సౌకర్యం కూడా తగ్గిపోవడంతో ప్లాస్టిక్‌ ముడిసరుకుకు రెక్కలొచ్చాయి. గతంలో రూ.8వేలు ఉన్న టన్ను ప్లాస్టిక్‌ ధర రూ.15వేలకు చేరుకున్నది.

స్టీల్‌ తయారీ పరిశ్రమలకు ఆక్సిజన్‌ సరఫరా నిలిపివేయడం తీవ్ర ప్రభావం చూపుతున్నది. స్టీల్‌ తయారీలో ఆక్సిజన్‌ వాడకం కూడా ఉంటుందని, కరోనా ప్రభావంతో ఆక్సిజన్‌ సిలిండర్ల అవసరం పెరగడంతో స్టీల్‌ పరిశ్రమలకు సరఫరాను నిలిపివేసినట్టు పరిశ్రమలవర్గాలు చెప్తున్నాయి. దీంతో ఉత్పత్తి తగ్గిపోయి, స్టీల్‌ ధరలు పెరిగినట్టు పేర్కొంటున్నాయి.

గతంలో టన్ను రూ.42 వేలు ఉండగా, ఇప్పుడది రూ.50 వేలకు చేరినట్టు చెప్తున్నారు. సిమెంట్‌ ధరలు కూడా టన్నుకు దాదాపు రూ.1500 వరకూ పెరిగాయి. మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా, జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌ తదితర రాష్ట్రాలకు చెందిన కార్మికులు క్రమంగా సొంతూళ్లకు ప్రయాణమవుతున్నారని, ఇది కూడా ఉత్పత్తిపై ప్రభావం చూపుతున్నదని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి.

వాస్తవానికి గతేడాది మార్చిలో మొదలైన లాక్‌డౌన్‌ నుంచే పరిశ్రమలు ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నది. వలస కార్మికులు సొంతూళ్లకు వెళ్లిపోవడం, పరిశ్రమలు దాదాపు ఆర్నెళ్లపాటు మూతపడటంతో చిన్నాచితకా పరిశ్రమలకు కోలుకోలేని దెబ్బ తగిలింది. బ్యాంకు రుణాలు చెల్లించే స్థోమతలేక పోవడంతోపాటు నిలిచిపోయిన పరిశ్రమలను మళ్లీ పట్టాలెక్కించేందుకు నానా తంటాలు పడ్డారు.