కోవిద్ మందులపై జీఎస్టీ మినహాయింపు సాధ్యం కాదు 

కొవిడ్‌ ఔషధాలకు జీఎస్టీ మినహాయింపు సాధ్యం కాదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. ఆ విధంగా చేస్తే ఆ మందులు వినియోగదారులకు మరింత ప్రియం అవుతాయని ఆమె హెచ్చరించారు. 

కొవిడ్‌ మందులు, టీకాలు, ఆక్సిజన్‌ కాన్సనే్ట్రటర్ల దేశీయ సరఫరా, వాణిజ్యపరమైన దిగుమతులకు జీఎస్టీ మినహాయింపు ఇస్తే తయారీదారులు వాటికి సంబంధించిన పెట్టుబడులపై చెల్లించే పన్నులను భర్తీ చేసుకోలేరని తెలిపారు. ప్రస్తుతం వ్యాక్సిన్ల దేశీయ సరఫరా, వాణిజ్య దిగుమతులపై 5 శాతం జీఎస్టీ ఉండగా.. కొవిడ్‌ ఔషధాలు, ఆక్సిజన్‌ కాన్సనే్ట్రటర్లపై 12 శాతం ఉంది. 

కొవిడ్‌పై పోరులో ఉపయోగిస్తున్న వైద్యపరికరాలు, ఔషధాలపై అన్ని రకాల పన్నులు, కస్టమ్స్‌ సుంకాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ  బెంగాల్‌ ముఖ్యమంత్రి  మమతా బెనర్జీ  ప్రధాని మోదీకి లేఖ రాశారు. కొవిడ్‌ సంబంధిత మందులు, ఆక్సిజన్‌ కాన్సనే్ట్రటర్లు, సిలిండర్లు, కంటెయినర్లు విరాళంగా ఇస్తామని అనేక సంస్థలు, వ్యక్తులు ముందుకు వస్తున్నారని.. వారికి పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఆమె లేఖపై ఆర్ధిక మంత్రి స్పందించారు.

‘‘జీఎస్టీ నుంచి పూర్తిగా మినహాయింపు ఇస్తే వ్యాక్సిన్‌ తయారీదారులు ధరలు పెంచడం ద్వారా పెట్టుబడుల (ముడిపదార్థాలు తదితర సామగ్రి కొనుళ్ల)పై చెల్లించే పన్నుల భారాన్ని కూడా అంతిమంగా వినియోగదారులపైనే వేస్తారు. 5 శాతం జీఎస్టీ రేటు వల్ల తయారీదారులు ఐటీసీని వినియోగించుకోగలుగుతారు. ఒకవేళ ఐటీసీ మించిపోతే క్లెయిమ్‌ చేసుకుంటారు. అంటే వ్యాక్సిన్లకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇస్తే వినియోగదారులకు నష్టం చేసినట్లే’’ అని సీతారామన్‌ ఆదివారం ట్వీట్‌ చేశారు. 

‘ఒక వస్తువు మీద సమీకృత జీఎస్టీ (ఐజీఎస్టీ) రూ.100 వసూలు చేస్తే సీజీఎస్టీ, ఎస్‌జీఎస్టీ కింద కేంద్రం, రాష్ట్రాలకు రూ.50 చొప్పున వెళ్తుంది. అదే సమయంలో సీజీఎస్టీ రాబడిలో 41 శాతం రాష్ట్రాలకు పంచుతాం. అంటే మొత్తం రూ.100 వసూలైతే అందులో రాష్ట్రాల వాటా రూ.70.50 ఉంటుంది’ అని ఆమె తెలిపారు. వ్యాక్సిన్లపై వసూలు చేసే జీఎస్టీ రాబడిలో రాష్ట్రాలకే 70 శాతం వెళ్తుందని ఆమె గుర్తు చేశారు. 

వాస్తవానికి 5 శాతం జీఎస్టీ అన్నది నామమాత్రమని, ఇది దేశీయ వ్యాక్సిన్‌ తయారీదారులు, ప్రజల ప్రయోజనాల కోసమే విధిస్తున్నట్లు ఆర్ధిక మంత్రి స్పష్టం చేశారు. కొవిడ్‌ ఆక్సిజన్‌, సంబంధిత పరికరాలు, ఇతర ఔషధాలకు ఇప్పటికే కస్టమ్స్‌ సుంకం, ఆరోగ్య శిస్తును మినహాయించినట్లు నిర్మల వెల్లడించారు. 

దీంతోపాటు భారత్‌లో ఉచితంగా సరఫరా చేసేందుకు ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ దిగుమతి చేసుకునే కొవిడ్‌ సంబంధిత సామగ్రి మొత్తానికి ఐజీఎస్టీ మినహాయింపు ఇచ్చినట్లు వివరించారు. అలాగే దేశంలో ఉచితంగా సరఫరా చేయడానికి దిగుమతి చేసేకునే సామగ్రిపైనా సీజీఎస్టీ మినహాయింపు ఇచ్చామని, అలా దిగుమతి చేసుకునే సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ధ్రువపత్రాల ఆధారంగా మినహాయింపు ఉంటుందని ఆమె తెలిపారు. 

ఆయా వస్తువులు అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో వాణిజ్య దిగుమతులకు కూడా బేసిక్‌ కస్టమ్స్‌ సుంకం, ఆరోగ్య శిస్తు నుంచి మినహాయింపు ఇచ్చినట్లు వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రెమ్‌డెసివిర్‌ సహా పలు మందులు, ఇతర సామగ్రి దిగుమతులపై కస్టమ్స్‌ డ్యూటీని రద్దు చేసిందని ఆమె గుర్తుచేశారు.