మావోయిస్టులకు కొరియర్ల ద్వారా కరోనా ముప్పు 

మావోయిస్టు దళంలోని కొందరు కీలక సభ్యులకు కరోనా సోకిందని, అత్యంత రహస్యంగా వారు వైద్యచికిత్స పొందుతున్నారన్న సమాచారాన్ని నిఘా వర్గాలు సేకరించాయి. దండకారణ్యంలో ఉన్న మావోయిస్టులకు కొరియర్ వ్యవస్థ ద్వారా కరోనా మహమ్మారి బారిన పడినట్లు నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. 

దట్టమైన అడవీ ప్రాంతంలో ఉన్న మావోయిస్టు దళాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించే కొరియర్ల నుంచి మావోయిస్టులు కరోనాకు గురవుతున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. మావోల్లో కొందరు కరోనా బారినపడి ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు అనుమానిస్తున్న పోలీస్ వర్గాలు మెరుగైన వైద్యం మావోయిస్టులు ఎదురు చూస్తున్నట్లు పేర్కొంటున్నారు.

ఈ క్రమంలో మావోయిస్టుల రాక కొసం పోలీసులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. పార్టీని వీడి వస్తే వైద్య సదుపాయం అందించడంతో పాటు ఆర్ధికంగా కూడా అండగా ఉంటామని భరోసా ఇచ్చే విధంగా హామీ ఇస్తున్నారు.

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ రీజన్ పరిధిలో దంతేవాడ, బీజాపూర్, సుక్మా జిల్లాలో సుమారు 70 నుంచి 100 మంది వరకు మావోయిస్టులకు కరోనా సోకినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆయా రాష్ట్రాల పోలీస్ వర్గాలు కూడా దృవీకరిస్తున్నాయి. కరోనా పాటు కొందరు కీలక నేతలు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. 

వీరిలో మోస్ట్ వాంటెడ్ మహిళ మావోయిస్టు సుజాత (రూ 25 లక్షల రివార్డ్),తో పాటు రూ 10 లక్షల రివార్డులు కలిగిన మావోయిస్టులు జయలాల్, దినేష్‌లు ఉన్నట్లు సమాచారం.కోవిడ్‌తో బాధపడుతున్న మావోలు జనజీవన స్రవంతిలోకి వచ్చినట్లయితే వారందరికీ ప్రభుత్వం తరపున మంచి వైద్యం అందిస్తామని పోలీసు ఉన్నతాధికారులు హామీ ఇస్తున్నారు. 

మరోవైపు మావోయిస్టుల్లో కొందరు కోవిడ్ బారినపడి ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది. మృతుల అంత్యక్రియలకు సంబంధించిన దృశ్యాలను పోలీసు అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న మావోయిస్టులలో వైరస్ సోకిన వారు ఎంత మంది ఉండొచ్చు అనే కోణంలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు.

అంతేకాకుండా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు దాని సమీపంలోని ఆసుపత్రులపైన, మావోయిస్టు సానుభూతి పరులైన కొందరు వైద్యుల పైన పోలీసులు నిఘా వేసి ఉంచారని తెలిసింది. ఇదిలావుండగా మావోయిస్టులలో ఎవరికైనా కరోనా సోకిందన్న సమాచారం తమవద్ద లేదని ఓ పోలీసు ఉన్నతాధికారి వివరించారు. కాగా తెలంగాణకు చెందిన కొందరు కీలక మావోయిస్టులు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్కండ్, బిహార్, మహారాష్ట్ర, ఒడిశాలలో తలదాచుకున్న క్రమంలో వారికి కరోనా బారిన పడిఉండొచ్చన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

కొద్ది నెలల కిందట మావోయిస్టు రామన్న భార్యకు కూడా కరోనా సోకినట్టు పోలీసులకు సమాచారం అందిందని, అలాగే వృద్దాప్యం పైబడ్డ మావోయిస్టు నేతలు దాదాపు ఇరవై మందికి పైగా కేంద్ర కమిటీలో ఉన్నారని వారికి షుగర్, బిపితో పాటు గుండెపరమైన జబ్బులున్నాయని వారు పార్టీ వీడి వస్తే వారికి అన్ని రకాల సహాయంతో పాటు వైద్యం అందిస్తామని పోలీసు అధికారులు పేర్కొంటున్నారు.

ఇదిలావుండగా కరోనా వైరస్ బారిన పడుతున్న మావోయిస్ట్ పార్టీలోని కొంతమంది నాయకులు, దళ సభ్యులు కూడా ఉన్నట్లు తమకు సమాచారం అందిందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్‌పి సునీల్ దత్ తెలిపారు. వీరిలో కొంతమంది వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తుందని, ఇందులో అగ్ర నాయకులు కూడా ఉన్నరని పేర్కొన్నారు.