పుదుచ్చేరి ముఖ్య‌మంత్రికి క‌రోనా పాజిటివ్‌

పుదుచ్చేరి ముఖ్య‌మంత్రి ఎన్ రంగ‌స్వామికి క‌రోనా నిర్ధార‌ణ అయ్యింది. క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో నిన్న ఆయ‌న పుదుచ్చేరిలోని ఇందిరాగాంధీ ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీలో క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకున్నారు. అందులో ఆయ‌న‌కు పాజిటివ్‌గా తేలింది. 

దీంతో చికిత్స నిమిత్తం చెన్నైలోని ఓ ప్రైవేటు ద‌వాఖాన‌లో చేరిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం ఆయ‌న ప‌రిస్థితి బాగానే ఉంద‌ని తెలిపారు. ఎన్ రంగ‌స్వామి పుదుచ్చేరి ముఖ్య‌మంత్రిగా గ‌త శుక్ర‌వారం ప్ర‌మాణ స్వీకారం చేశారు. సీఎంగా బాధ్య‌తలు చేప‌ట్టిన నాలుగు రోజుల‌కే ఆయ‌న క‌రోనాబారిన ప‌డ్డారు. అదేవిధంగా ప్ర‌మాణ‌స్వీకార కార్య‌క్ర‌మానికి హాజ‌రైన‌వారిలో 11 మందికి క‌రోనా నిర్ధార‌ణ అయిన‌ట్లు వెల్ల‌డించారు.

కాగా, దేశంలో క‌రోనా ఉధృతి స్వ‌ల్పంగా త‌గ్గింది. గ‌త నాలుగు రోజులుగా ప్ర‌తిరోజూ నాల‌గు ల‌క్ష‌ల‌కుపైగా పాజిటివ్‌ కేసులు, రెండు రోజులుగా 4 వేల కంటే అధికంగా మ‌ర‌ణాలు న‌మోద‌వుతున్నాయి. తాజాగా ఈ ప‌రంప‌ర‌కు కాస్తా బ్రేక్ ప‌డింది. ఆదివారం ఆ సంఖ్య 3.6 ల‌క్ష‌ల‌కు ప‌డిపోయింది. 

అదేవిధంగా మ‌ర‌ణాలు కూడా నాలుగు వేల దిగువ‌కు ప‌డిపోయాయి.దేశ‌వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 3,66,317 కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,26,62,410కు చేరింది. ఇక మ‌రో 3,747 మంది బాధితులు క‌రోనాతో మ‌ర‌ణించ‌డంతో మొత్తం మృతులు 2,46,146కు పెరిగారు.

హర్యానాలో మరో వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ను పొడగిస్తున్నట్లు ఆ రాష్ట్ర హోం, ఆరోగ్యశాఖ మంత్రి అనిల్‌ విజ్‌ తెలిపారు. ఈ నెల 17 వరకు లాక్‌డౌన్‌ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

 పెరుగుతూ వస్తున్న కేసుల మధ్య ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం ఈ నెల 11 నుంచి 18వ తేదీ వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు పేర్కొంది. మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు కేబినెట్‌ మంత్రి సుబోధ్‌ యునియల్‌ తెలిపారు. కర్ఫ్యూ సమయంలో పాలు, కూరగాయలు, పండ్లు, మాంసం తదితర అత్యవసర దుకాణాలను ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.