దేశం మిమ్మల్ని క్షమించదు హేమంత్ సోరెన్‌

కొవిడ్-19 పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీని విమర్శించిన జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ పై  మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  ‘‘హేమంత్ జీ… రాజకీయ ప్రయోజనాల కోసం విచక్షణ లేకుండా మాట్లాడిన మిమ్మల్ని దేశం క్షమించదు..’’ అంటూ హెచ్చరించారు.

ప్రధానిపై సోరెన్ చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి పదవికే అవమానం తెచ్చాయంటూ ఆయన మండిపడ్డారు. జార్ఖండ్‌లో కొవిడ్-19 పరిస్థితిపై ప్రధాని మోదీ వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులకు ఫోన్ చేసి మాట్లాడుతున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో నిన్న ఆయన జార్ఖండ్ సీఎం సోరెన్‌తో కూడా మాట్లాడారు. అయితే ప్రధాని మోదీ తన మనసులో మాట (మన్ కీ బాత్) మాత్రమే చెప్పారనీ.. కొవిడ్‌పై తాము చెప్పిందేమీ పట్టించుకోలేదంటూ ట్విటర్ వేదికగా సోరెన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

దీనిపై చౌహాన్ స్పందిస్తూ.. ‘‘ప్రధాని నరేంద్రమోదీపై విమర్శలు చేసి హేమంత్ సోరెన్ తన సీఎం పదవికే అపకీర్తి తెచ్చారు. ప్రధానిని ఇప్పటి వరకు ఎవరూ అంత తక్కువ చేసి మాట్లాడలేదు. ప్రధాని ఫోన్‌కాల్‌ను సోరెన్ కేవలం రాజకీయాలకు వాడుకోవడం మాత్రమే కాదు.. ఆయన వాడిన భాషలో కూడా హుందాతనం, గౌరవం ఏమాత్రం లేదు. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను..’’ అని చౌహాన్ పేర్కొన్నారు. 

మోదీ ప్రతి ఒక్క ముఖ్యమంత్రితో పాటు ఇతరులు చెప్పిన విషయాలు కూడా వింటున్నారనీ… జార్ఖండ్ పట్ల పట్టింపు ఉంది కాబట్టే ప్రధానమంత్రి స్వయంగా ఫోన్ చేశారన్న విషయం సోరెన్ గుర్తుంచుకుంటే మంచిదంటూ హితవు పలికారు.

‘‘జార్ఖండ్‌తో పాటు దేశం యావత్తూ కొవిడ్-19తో అల్లాడుతోంది. కాబట్టి ప్రధాని కేవలం కొవిడ్-19 గురించి మాత్రమే మాట్లాడారు. ఒకవేళ హేమంత్ వేరే విషయాలు మాట్లాడదల్చుకుంటే… ఆయనే ప్రధానికి ఫోన్ చేసి తన బాధ చెప్పుకోవచ్చు. ఎవరు వద్దన్నారు?’’ అని సీఎం చౌహాన్ ప్రశ్నించారు.

ప్రధాని మోదీ అత్యంత సున్నితమైన వ్యక్తిత్వంగల వారనీ.. కరోనా విపత్తు వేళ దేశం కోసం అహోరాత్రులు పనిచేస్తున్నారని చౌహాన్ కొనియాడారు. ఫెడరల్ వ్యవస్థకు అనుగుణంగా రాష్ట్రాలకు సహకారం అందించే విషయంలోనూ, పనిచేసే విషయంలోనూ ప్రధాని మోదీ ఆదర్శనీయుడంటూ చౌహాన్ వ్యాఖ్యానించారు.