బెంగాల్ హింసపై నివేదిక కోరిన హైకోర్టు 

పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత కొనసాగుతున్న హింసాకాండను అదుపు చేయడానికి తీసుకుంటున్న చర్యలపై సవివరమైన నివేదికను ఇవ్వాల్సిందిగా కోల్‌కతా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. కేంద్ర హోం శాఖ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. 

గతంలో ఎన్నడూ లేని రీతిలో ఎన్నికల అనంతరం జరుగుతున్న హింసాకాండపై పరిశీలించేందుకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ఐదుగురు న్యాయమూర్తులతో ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. ఫలితాల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న హింసను నిలువరించాలని కోరుతూ అడ్వకేట్‌ అనింద్య సుందర్‌ దాస్‌ ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. 

ఈ కేసు విచారణను తొలుత తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రాజేష్‌ బిందాల్‌, జస్టిస్‌ అరిజిత్‌ బెనర్జీలతో కూడిన బెంచ్‌ విచారించింది. ఈ కేసు గురించి కేంద్ర ప్రభుత్వానికి చెందిన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ పలు ప్రశ్నలు లేవనెత్తారు. 

మధ్యాహ్నం రెండు గంటల సమయంలో కేసును విచారణకు చేపట్టిన బెంచ్‌, దీని పర్యవసానాలను పరిగణనలోకి తీసుకుని ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ కేసు విచారణ 10వ తేదీ విచారణకు రానుంది. కోల్‌కతా హైకోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని పిల్‌లో ప్రత్యేకంగా సూచించారు. బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు.

 మరోవంక,  ప‌శ్చిమ బెంగాల్ లో ఎన్నిక‌ల అనంత‌ర హింసాకాండ నేప‌థ్యంలో శాంతి భ‌ద్ర‌త‌ల ప‌రిస్థితిని త‌న‌కు స‌మ‌గ్రంగా నివేదించాల‌ని కోరుతూ గ‌వ‌ర్న‌ర్ జ‌గ్దీప్ దంక‌ర్ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శికి శ‌నివారం స‌మ‌న్లు జారీ చేశారు. 

అల్ల‌ర్లకు సంబంధించి త‌న‌కు అద‌న‌పు ముఖ్య కార్య‌ద‌ర్శి హెచ్ ఎస్ ద్వివేది త‌న‌కు ఎలాంటి స‌మాచారం అందించ‌లేద‌ని డీజీపీ, కోల్ క‌తా పోలీస్ క‌మిష‌న‌ర్ లు మే 3న త‌నకు పంపిన నివేదిక‌ల‌ను తొక్కిపెట్టార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. ఎన్నిక‌ల అనంత‌ర హింస‌పై త‌న‌కు స‌మ‌గ్రంగా వివ‌రించేందుకు శ‌నివారం సాయంత్రం ఏడు గంట‌లలోగా త‌న‌ను క‌లిసి నివేదించాల‌ని గ‌వ‌ర్నర్ జ‌గ్దీప్ దంక‌ర్ ట్వీట్ చేశారు. 

అద‌న‌పు ముఖ్య‌కార్య‌ద‌ర్శి ద్వివేది విధి నిర్వ‌హ‌ణ‌లో తీవ్ర నిర్ల‌క్ష్యం క‌న‌బ‌రిచార‌ని, డీజీపీ, పోలీస్ క‌మిష‌న‌ర్ల నివేదిక‌ల‌ను త‌న‌కు స‌మ‌ర్పించ‌కపోవ‌డం ప‌ట్ల ఆయ‌న తీరును గ‌వ‌ర్న‌ర్ త‌ప్పుప‌ట్టారు. ఎన్నిక‌ల అనంత‌ర హింస‌పై రాష్ట్రంలో ఆందోళ‌న‌క‌ర ప‌రిస్థితి నెల‌కొంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.