కరోనా కట్టడికి త్రివిధ దళాల సమాయత్తం 

సరిహద్దుల్లో శత్రువులపై పోరాడే మన సైనికులు ఇప్పుడు దేశ ప్రజలను కరోనా మహమ్మారి నుండి కాపాడటం కోసం మరో రకపు యుద్ధం చేస్తున్నారు. త్రివిధ దళాలు కరోనా కట్టడికి పోరాటం చేస్తున్నాయి. సునామీలా విరుచుకుపడ్డ సెకండ్‌ వేవ్‌ బారి నుంచి రక్షించడానికి యుద్ధ సన్నద్ధతతో సేవలు అందిస్తున్నాయి.

దేశంలో ఆక్సిజన్‌ కొరత, రవాణాలో సమస్యలు తదితర అంశాలపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌,  సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌, త్రివిధ దళాల అధిపతులతో ఏప్రిల్‌లో భేటీ అయ్యారు. కొవిడ్‌ యుద్ధంలో పాల్గొనాల్సిందిగా సూచించారు. ఈ మేరకు త్రివిధ దళాలు రంగంలోకి దిగాయి.

ఆక్సిజన్‌ రవాణా మిషన్‌లో నౌకాదళం కూడా పాలుపంచుకొన్నది. 9 యుద్ధ నౌకల్లో ఆక్సిజన్‌ను విదేశాల నుంచి రవాణా చేస్తున్నది. ఈ యుద్ధ నౌకలు కువైట్‌, ఖతార్‌ తదితర దేశాల నుంచి ఆక్సిజన్‌ను మోసుకొని వస్తున్నాయి. ఐఎన్‌ఎస్‌ తల్వార్‌ యుద్ధ నౌక బహ్రెయిన్‌ నుంచి 54 టన్నుల ద్రవ ఆక్సిజన్‌తో బయల్దేరి ఈ నెల 5న కర్ణాటకలోని మంగూళూరుకు చేరుకొన్నది. ఐఎన్‌ఎస్‌ కొచ్చి, ఐఎన్‌ఎస్‌ తబర్‌, ఐఎన్‌ఎస్‌ కోల్‌కతా, ఐఎన్‌ఎస్‌ ఐరావత్‌ తదితర యుద్ధ నౌకలు కూడా ఆక్సిజన్‌ను రవాణా చేస్తున్నాయి.

కరోనాపై యుద్ధంలో ప్రభుత్వాలకు సహకారం అందించేందుకు ఆర్మీకి చెందిన 600 మంది వైద్య సిబ్బంది రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీ, అహ్మదాబాద్‌, లక్నో, పాట్నా తదితర నగరాల్లో కొవిడ్‌ కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. కరోనా సేవల కోసం ఆర్మీ రిటైర్‌ అయిన మరో 600 మంది వైద్య సిబ్బందిని విధుల్లోకి తీసుకొన్నది. మిలిటరీ ఆధ్వర్యంలో 19 కొవిడ్‌ దవాఖానలు ఉన్నాయి. 

విదేశాల నుంచి ఆక్సిజన్‌ను, వైద్యపరికరాలను తీసుకురావడంలో వాయుసేన కీలకపాత్ర పోషిస్తున్నది. ఏప్రిల్‌ 24న సింగపూర్‌ నుంచి 24 ఆక్సిజన్‌ కంటైనర్లను తీసుకువచ్చింది. తర్వాత దుబాయ్‌, థాయ్‌లాండ్‌, జర్మనీ, ఆస్ట్రేలియా నుంచి ఆక్సిజన్‌ను ఇండియాకు రవాణా చేసింది. శుక్రవారం ఇజ్రాయెల్‌ నుంచి 3 క్రయోజెనిక్‌ కంటైనర్లను తీసుకువచ్చింది. ఇప్పటివరకు మొత్తం ఏడు దేశాల నుంచి 72 క్రయోజెనిక్‌ ట్యాంకర్లు, 1,252 ఆక్సిజన్‌ సిలిండర్లను రవాణా చేసింది.