జూలై కల్లా ముగియ‌నున్న క‌రోనా సెకండ్ వేవ్

కరోనా సెకండ్ వేవ్ జూలై నాటికి ముగియ‌నున్న‌ది. తిరిగి థ‌ర్డ్‌ వేవ్ అక్టోబర్లో ప్రారంభం కానున్న‌ది. ఈ విష‌యాల‌ను ఐఐటీ కాన్పూర్‌కు చెందిన ప‌రిశోధ‌కులు వెల్ల‌డించారు. వీరు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. రాజస్థాన్ రాష్ట్రంలో మే 10-12 మధ్య కేసులు తీవ్రంగా ఉంటాయి. జూన్ మొదటి వారం నుంచి ఉప‌శ‌మ‌నం క‌లుగడం ప్రారంభమ‌వుతుంది.

దేశంలో కరోనా వైర‌స్ సెకండ్ వేవ్‌ కొనసాగుతున్న‌ది. ఇదే స‌మ‌యంలో కేంద్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ విజయ్ రాఘవన్ కూడా థ‌ర్డ్‌ వేవ్ గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ కూడా ప్రభుత్వం యొక్క ఈ భయాలు నిజ‌మేన‌ని చెప్పారు. 

కరోనా డాటాను విశ్లేషిస్తున్న ప్రద్మశ్రీ ప్రొఫెస‌ర్ మ‌నీంద్ర అగ‌ర్వాల్‌.. కరోనా సెకండ్‌ వేవ్ జూలై నాటికి ముగుస్తుందని పేర్కొన్నారు. ఇదే స‌మ‌యంలో థ‌ర్డ్‌ వేవ్ అక్టోబర్ నుంచి మొద‌ల‌య్యే అవ‌కాశాలు ఉన్నాయని తెలిపారు.

అయితే, ఈ అధ్యయనంలో థ‌ర్డ్‌ వేవ్ ఏమాత్రం భ‌య‌పెడుతుందో అన్న విష‌యాల‌ను వెల్ల‌డించ‌లేదు. ఇది సాధారణ వేవ్‌గానే ఉండే అవ‌కాశాలు కనిపిస్తున్నాయ‌ని ప్రొ. అగ‌ర్వాల్ అంటున్నారు. మ‌న దేశంలో ఇప్పుడు పీక్ స్థితికి చేరుకున్న‌ది. మే 10-15 కు బ‌దులుగా ఈ పీక్ సిచ్యువేష‌న్ ఒక‌టి, రెండు వారాల వ‌ర‌కు మార‌వ‌చ్చున‌ని, ఇది ఆందోళ‌న క‌లిగించే విష‌య‌మ‌ని అగ‌ర్వాల్ చెప్పారు. ఒడిశా, అసోం, పంజాబ్‌లలో గరిష్ట సమయం ఇంకా క్లియర్ కాలేదని అగర్వాల్ తెలిపారు. 

కాగా,  దేశంలోని 180 జిల్లాల్లో గ‌త వారంరోజుల నుంచి ఒక్క కొత్త కేసు కూడా న‌మోదు కాలేద‌ని కేంద్ర ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. ఈ మేర‌కు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఒక ప్ర‌క‌ట‌న చేసింది. ఇక 18 జిల్లాల్లో అయితే గ‌త 14 రోజుల నుంచి ఒక్క కొత్త కేసు కూడా లేద‌ని ఆ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. 54 జ‌ల్లాల్లో అయితే గ‌త మూడు వారాలుగా  ఒక్క కొత్త కేసూ లేద‌ని వెల్ల‌డించింది.