కర్ణాటక, తమిళనాడు, కేరళల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌

పెద్ద ఎత్తున కరోనా కేసులు, మరణాలు నమోదవుతుండడంతో ఆ రాష్ట్రంలో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. వైరస్‌ కట్టడి కోసం ఇన్నాళ్లు విధించిన పాక్షిక లాక్‌డౌన్‌ ఫెయిలైందని ఇకపై సంపూర్ణ లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప ప్రకటించారు. నిత్యం 50 వేలకు పైగా కేసులు, 400 వరకు మరణాలు సంభవిస్తుండడంతో చివరి అస్త్రంగా సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నట్లు సీఎంం యడియూరప్ప తెలిపారు.
 
కోవిడ్‌ కట్టడి కోసం ఏప్రిల్‌ 27 నుంచి మే 12 వరకు విధించిన కరోనా కర్ఫ్యూ వల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో మే 10 నుంచి 24వ తేదీ వరకు సంపూర్ణ లాక్‌డౌన్‌ ప్రకటించారు. లాక్‌డౌన్‌పై మంత్రులు, అధికారులతో సుదీర్ఘ చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. 
 
14 రోజుల లాక్‌డౌన్‌లో అత్యవసర సేవలు మినహాయించి అన్నింటిని బంద్‌ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి యడియూరప్ప స్పష్టం చేశారు. నిత్యవసర సరుకుల కొనుగోలు కోసం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత ఒక్కరూ బయట కనిపించినా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.
 
అంతర్రాష్ట్ర, అంతర్‌జిల్లా ప్రయాణాలు, బార్లు, పాఠశాలలు, ప్రజా రవాణా, కర్మాగారాలు, అన్ని కార్యాలయాలు, మెట్రో రైల్వే మూతపడ్డాయి. అయితే భవన నిర్మాణ కార్మికులకు మినహాయింపు ఇచ్చారు. విమాన, రైల్వే రాకపోకలపై ఎలాంటి నిషేధం లేదు. వివాహాలకు కేవలం 50 మందికి మాత్రమే అవకాశం కల్పించారు.
 
వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు 14 రోజుల పాటు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ అమలు చేయనున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 10వ తేదీన ఉదయం 4 గంటల నుంచి ఈ నెల 24వ తేదీ ఉదయం 4 గంటల వరకు అమలులో ఉంటుందని వెల్లడించింది. కిరాణ, కూరగాయలు, మాంసం దుకాణాలు, ఫార్మాసీ దుకాణాలు మినహా మిగతా అన్ని దుకాణాలు మూసివేయనున్నట్లు తెలిపింది.
 
క‌రోనా వ్యాప్తిని నిలువ‌రించ‌డానికి నేటి నుంచి తొమ్మిది రోజుల‌పాటు పూర్తి స్థాయి లాక్‌డౌన్ కేరళ ప్రభుత్వం విధించింది. దీంతో శ‌నివారం ఉద‌యం నుంచే రోడ్లు నిర్మానుష్యంగా మారిపోయాయి. పూర్తిస్థాయి లాక్‌డౌన్ ఈనెల 16 వ‌ర‌కు అమ‌ల్లో ఉంటుంద‌ని సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ ప్ర‌క‌టించింది.
 
కాగా, కరోనా వైరస్ కట్టడి కోసం ఈ నెల 9 నుంచి 15 రోజుల పాటు గోవాలో కర్ఫ్యూ విధించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే సందర్శకులకు కొవిడ్-19 నెగిటివ్ రిపోర్టు లేదా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌ తప్పనిసరి చేస్తున్నట్టు ప్రకటించింది. 
 
కర్ఫ్యూ సమయంలో కిరాణా దుకాణాలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే తెరిచివుంచాలనీ… ఫార్మసీలు, ఇతర వైద్య సదుపాయాలపై ఎలాంటి ఆంక్షలు ఉండవని సీఎం ప్రమోద్ సావంత్ పేర్కొన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఆంక్షలను ప్రజలు పదే పదే ఉల్లంఘిస్తున్న నేపథ్యంలో కర్ఫ్యూ నిర్ణయం తీసుకున్నట్టు సీఎం తెలిపారు. 
 
కేంద్రపాలిత ప్రాంత‌మైన చండీగ‌ఢ్‌లో క‌రోనా తీవ్ర‌త నేప‌థ్యంలో నేటి  నుంచి వీకెండ్‌ క‌ర్ఫ్యూ అమ‌లులోకి వ‌స్తుంది. శ‌నివారం ఉద‌యం 5 గంట‌ల నుంచి సోమ‌వారం ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు వారాంత‌ క‌ర్ఫ్యూ విధిస్తారు. నిత్య‌వ‌స‌ర వ‌స్తువులు హోమ్ డెలివ‌రీకి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు షాపులు తెరిచేందుకు అనుమ‌తిస్తారు. రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు రెస్టారెంట్ల నుంచి ఫుడ్ హోమ్ డెలివ‌రీకి అనుమ‌తిస్తారు.