చంద్రబాబుపై కర్నూల్ లో క్రిమినల్ కేసు 

కరోనా కట్టడిపై టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో విషప్రచారం చేస్తున్నారంటూ ఆయనపై కర్నూలు వన్‌టౌన్‌ పీఎస్‌లో కేసు నమోదైంది. సీనియర్‌ న్యాయవాది సుబ్బయ్య ఫిర్యాదు మేరకు చంద్రబాబుపై పోలీసులు కేసును నమోదుచేశారు. 

కర్నూలు కేంద్రంగా ఎన్‌ 440 అనే స్ట్రెయిన్‌ వ్యాప్తి అనే అభూత కల్పనను చంద్రబాబు సృష్టించారని సుబ్బయ్య ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు దుష్ప్రచారంతో పలువురి చావుకు కారణమయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

చంద్రబాబుపై తగుచర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో తెలిపారు. న్యాయవాది సుబ్బయ్య ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు.. చంద్రబాబుపై 188, 505(1)(బి)(2) సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు.

కరోనా విలయ తాండవం చేస్తున్న వేళ ప్రతిపక్ష నేతలపై కక్షసాధింపు చర్యలా? అంటూ  టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంక్రటావ్    ప్రశ్నించారు. 

ఎన్440కే వైరస్ పై ఈ నెల 4న హిందూ దినపత్రికలో వచ్చిన కథనాన్నే చంద్రబాబు ఉటంకించారని, కరోనాపై సాధారణ పౌరులైనా తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వెల్లడించవచ్చని సుప్రీం పేర్కొందని గుర్తు చేశారు. కరోనాను అడ్డుపెట్టుకొని రాజకీయ ప్రత్యర్థులపై కక్షసాధింపు చర్యల్లో సీఎం జగన్ నిమగ్నమయ్యారని మండిపడ్డారు. 

కాగా, సీఎం జగన్ తన వైఫల్యాలను కప్పి పుచ్చుకోడానికే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై అక్రమ కేసు పెట్టారని టీడీపీ సీనియర్ నేత కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. కొత్త వైరస్ నుంచి ప్రజలు తమ ప్రాణాలు కాపాడుకోవాలని అప్రమత్తం చేయడం చంద్రబాబు చేసిన తప్పా? అని ప్రశ్నించారు. 

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై కేసులు పెట్టి, కరోనా సమాచారాన్ని కప్పిపుచ్చాలనుకుంటున్నారని, ఆయనపై కేసు పెట్టడం సుప్రీం ఆదేశాలను ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు.