కోవిడ్-19 మూడో ప్రభంజనాన్ని కట్టడి చేయవచ్చు 

క‌ఠిన‌మైన‌ చ‌ర్య‌లు తీసుకోవడం వ‌ల్ల క‌రోనా థ‌ర్డ్ వేవ్ రాకుండా అడ్డుకోగ‌ల‌మ‌ని కేంద్ర ప్ర‌భుత్వ ప్రిన్సిప‌ల్ సైంటిఫిక్ అడ్వైజ‌ర్ కే విజ‌య్‌రాఘ‌వ‌న్‌ తెలిపారు. ఇలా చేయ‌డం వ‌ల్ల క‌నీసం అన్ని ప్రాంతాల్లో లేదా ఎక్క‌డా రాకుండా కూడా అడ్డుకోగ‌ల‌మ‌ని ఆయ‌న చెప్పారు.  అయితే అది స్థానికంగా అంటే రాష్ట్రాలు, జిల్లాలు, న‌గ‌రాలు, ప‌ల్లెల్లో మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ఎంత స‌మర్థంగా అమలు చేస్తున్నార‌న్న‌దానిపై ఆధార‌ప‌డి ఉంటుంద‌ని విజ‌య్‌రాఘ‌వ‌న్ పేర్కొన్నారు. 
 
ఇక కొవిడ్ నుంచి కోలుకున్న వాళ్ల‌లో బ్లాక్ ఫంగ‌స్ లేదా మ్యూకోర్మిసిస్ వ‌స్తుంద‌న్న వార్త‌ల‌పై స్పందిస్తూ.. దీనిని తాము జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. ఇక నీళ్ల ద్వారా క‌రోనా వ్యాపించ‌ద‌ని కూడా ఆయ‌న స్ప‌ష్టం చేశారు.
 
కాగా, భారతదేశంలో కోవిడ్-19 వ్యాక్సిన్ వయస్సు వారీగా పంపిణీ చేసిన వివరాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 60 ఏళ్లు పైబడిన పౌరులకు 41 శాతం కోవిడ్-19 టీకా వేసినట్లు పేర్కొంది. 45-60 సంవత్సరాల వయస్సు గలవారు 46 శాతం ఉన్నారని తెలిపింది. 
 
30-45 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు 9శాతం, 18-30 సంవత్సరాల వయస్సు గలవారు 4శాతం వాటా కలిగి ఉన్నారని, మొత్తం 16.50 కోట్ల డోసులు ఇప్పటివరకు నిర్వహించబడింది. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. దేశంలో రోజువారీగా కోవిడ్ కేసులు లక్షల్లోనే నమోదవుతున్నాయి. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి.