ఆ 12 రాష్ట్రాల్లోనే అత్య‌ధికంగా కొత్త‌ కేసులు

దేశంలో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉన్న‌ది. గ‌త రెండు రోజుల నుంచి వ‌రుస‌గా నాలుగు ల‌క్ష‌ల‌కుపైగా రోజువారీ కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. 

ముఖ్యంగా మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క‌, కేర‌ళ‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, గుజ‌రాత్‌, త‌మిళ‌నాడు, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, ప‌శ్చిమ‌బెంగాల్‌, హర్యానా, బీహార్ ఈ 12 రాష్ట్రాల్లోనే భారీగా కొత్త కేసులు బ‌య‌ట‌ప‌డుతున్నాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య‌శాఖ అద‌న‌పు కార్య‌ద‌ర్శి ఆర్తి అహుజా వెల్ల‌డించారు.

తెలంగాణ‌, మ‌హారాష్ట్ర‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, ఢిల్లీ, రాజ‌స్థాన్‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, గుజ‌రాత్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఇటీవ‌ల కేసులు బాగా పెరిగినా ఇప్పుడు క్ర‌మంగా త‌గ్గుతున్నాయ‌ని ఆర్తి అహుజా తెలిపారు. 

ఇక పంజాబ్‌, జ‌మ్ముక‌శ్మీర్‌, అస్సాం, హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌, పుదుచ్చేరి, మేఘాల‌యా, త్రిపుర‌, అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్‌, నాగాలాండ్ రోజూవారీ కొత్త కేసుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతూ వ‌స్తున్న‌ద‌ని ఆమె చెప్పారు.

క‌ర్ణాట‌క‌, కేర‌ళ‌, త‌మిళ‌నాడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ప‌శ్చిమ‌బెంగాల్‌, బీహార్‌, హ‌ర్యానా, ఒడిశా, ఉత్త‌రాఖండ్ రాష్ట్రాల్లో కేసులు బాగా పెరుగుతున్నాయ‌ని అహుజా తెలిపారు. ఇక వ్యాక్సినేషన్ ప్ర‌క్రియ కూడా వేగంగా సాగుతుంద‌ని చెప్పారు. 

ఇప్ప‌టివ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా 16.50 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇచ్చిన‌ట్లు ఆమె వెల్ల‌డించారు. అదేవిధంగా 18-44 ఏండ్ల మ‌ధ్య వ‌య‌సు వారికి కూడా ఇప్ప‌టివ‌ర‌కు 11.81 ల‌క్ష‌ల డోసుల టీకాలు ఇచ్చిన‌ట్లు తెలిపారు.