కరోనా కట్టడిలో దేశానికే ఆదర్శం `ముంబై నమూనా’

దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో కొవిడ్‌ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. దేశమంతా సెకండ్‌వేవ్‌ ఉధృతి కొనసాగుతుంటే.. ఇక్కడ మాత్రం కరోనా కోరలు బలహీనమవుతున్నాయి. బీఎంసీ అధికారులు.. ముఖ్యంగా బీఎంసీ అదనపు కమిషనర్‌ (ఆరోగ్యం) సురేశ్‌ కాకాని ముందుచూపుతో తీసుకున్న పలు కీలక నిర్ణయాలతో ఇది సాధ్యమైంది. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రొటోకాల్‌ను పాటిస్తూ  టెస్టింగ్‌, ట్రేసింగ్‌, ట్రీటింగ్‌ను ముమ్మరం చేయడమే కాకుండా  ప్రజలు ఆందోళన చెందకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారు కొవిడ్‌ బెడ్ల కోసం ఉరుకులూ పరుగులూ పెట్టకుండా సింగిల్‌ విండో వ్యవస్థను ఏర్పాటు చేశారు.

వార్‌రూం అంటే సాధారణంగా ఎన్నికల సమయంలో పార్టీలు వ్యూహాల కోసం ఏర్పాటు చేసుకుంటాయి. బీఎంసీ అదనపు కమిషనర్‌ సురేశ్‌ కాకాని కొవిడ్‌ నియంత్రణకు వార్‌ రూం వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఏప్రిల్‌ 4న 11,163 కేసులు నమోదవ్వడంతో  యుద్ధప్రాతిపదికన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒక వ్యక్తికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది మొదలు.. కాంటాక్ట్‌ ట్రేసింగ్‌, మందుల సరఫరా, లక్షణాలు ఎక్కువగా ఉంటే ఆస్పత్రిలో చికిత్స వంటివాటిపై వార్‌రూం దృష్టిపెడుతుంది. వార్‌రూం ఏర్పాటైన తొలినాళ్లలో టోల్‌ఫ్రీ నంబర్‌కు వచ్చే ఫోన్‌కాల్‌ ఆధారంగా అధికారులు ఏ ఆస్పత్రిలో బెడ్‌ ఖాళీగా ఉందో తెలుసుకునే వారు.

ఇది భారీ ప్రక్రియ కావడంతో.. సురేశ్‌ కాకాని డ్యాష్‌బోర్డు వ్యవస్థను పరిచయం చేశారు. అంతే.. ఒక్క మీటతో సాధారణ, ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ బెడ్ల వివరాలు తెలుసుకునే వెసులుబాటు కలిగింది. ఈ క్రమంలో క్షేత్రస్థాయి సమస్యలను దృష్టిలో పెట్టుకుని, మొత్తం 24 వార్డుల్లో 24 వార్‌రూంలను ఏర్పాటు చేశారు. ఫలితంగా సిబ్బందిపై ఒత్తిడి తగ్గి, స్థానికులకు కావాల్సిన సమాచారం అందుతోంది. ఈ 24 వార్‌రూంలతో ప్రధాన వార్‌రూం(ప్రస్తుతం కొవిడ్‌ కంట్రోల్‌ రూం) అనుసంధానమై ఉంటుంది.

కొవిడ్‌ తొలి వేవ్‌లో ముంబైలో జంబో సెంటర్‌ పేరుతో తాత్కాలిక కొవిడ్‌ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఫిబ్రవరిలో కరోనా తగ్గుముఖం పట్టడంతో.. వాటిని తొలగించాలని బీఎంసీ నిర్ణయించగా.. సురేశ్‌ కాకాని అభ్యంతరం చెప్పారు. సెకండ్‌వేవ్‌లో పరిస్థితిని ముందే అంచనా వేసి, మరిన్ని జంబో సెంటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. 

ఆయన ఊహించినట్లే.. ఫిబ్రవరి రెండో వారం నుంచి ముంబైలో సెకండ్‌ వేవ్‌ ప్రారంభమైంది. మొదటివేవ్‌లో 12వేల బెడ్లు ఉండగా.. ఇప్పుడా సంఖ్య 24 వేలకు చేరుకుంది. వీటిల్లో 12,754 ఆక్సిజన్‌ బెడ్లు ఉన్నాయి. 2,929 వెంటిలేటర్‌ బెడ్లు కొవిడ్‌ చికిత్సకు సిద్ధమయ్యాయి. వచ్చే నెలలోగా మరికొన్ని కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.

కొవిడ్‌ లక్షణాలు తీవ్రమై.. ఛాతీలో ఇన్ఫెక్షన్‌ స్థాయికి వెళ్లిన రోగులకు అవసరమయ్యే రెమ్‌డెసివిర్‌ వంటి మందుల కొరత లేకుండా బీఎంసీ ముందు నుంచి జాగ్రత్త తీసుకుంది. 

‘‘మా దగ్గర ఇప్పుడు రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు, ఇతర అత్యవసర ఔషధాలు, ఆక్సిజన్‌కు ఎలాంటి కొరత లేదు’’ అని సురేశ్‌ కాకాని చెప్పారు. ఏప్రిల్‌ 16వ తేదీ అర్ధరాత్రి ఆక్సిజన్‌ కొరత రావడంతో.. ఓ ఆస్పత్రిలోని 168 మంది కొవిడ్‌ రోగులను ఆరు ప్రభుత్వాస్పత్రులకు తరలించామని, ఆ తర్వాతే.. ఆక్సిజన్‌ కొరత లేకుండా పక్కాగా రూట్‌మ్యా్‌పను సిద్ధం చేసుకున్నామని ఆయన వివరించారు.