క‌రోనాతో పోరాడండి, మోదీతో కాదు

మ‌న్ కీ బాత్ ప్ర‌సంగం మాదిరిగా కాకుండా తాము చెప్పేది కూడా వినాలంటూ ప‌్ర‌ధాని మోదీని ట్విట్ట‌ర్‌లో విమ‌ర్శించిన జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్ట‌ర్‌ హ‌ర్ష వ‌ర్ధ‌న్ ట్విట్ట‌ర్‌లో గ‌ట్టిగా కౌంట‌ర్ ఇచ్చారు. క‌రోనా పోరుపై సీఎం దృష్టిసారించాలి గానీ ప్ర‌ధాని మోదీపై కాద‌ని హితవు చెప్పారు.

 “దేశ ప్రధానిపై ఒక ప్రకటన చేస్తున్నప్పుడు, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా మహమ్మారిపై పోరాడాల‌న్న సంగ‌తిని ఆయన మర్చిపోకూడదు. మీ వైఫల్యాన్ని దాచడానికి ప్రయత్నిస్తూ ప్రధాని మోడీపై ఆగ్రహం వ్యక్తం చేయడం ఖండించదగినది ” అని హిందీలో ట్వీట్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం తన ఖ‌జానాను మూసివేసి, నిధులు ఖ‌ర్చు చేయ‌కుండా కేంద్ర‌మే అంతా చేయాల‌ని హేమంత్ సోరెన్ కోరుతున్నార‌ని హ‌ర్ష వ‌ర్థ‌న్ ఆరోపించారు. “కరోనా వైరస్ తో పోరాడండి, ప్రధానితో కాదు” అని ఘ‌టుగా వ్యాఖ్యానించారు. 

కొందరు నాయకులు ఈ విధంగా దిగజారడం పట్ల  బిజెపి ప్రధాన కార్యదర్శి (సంస్థాగతం) బి ఎల్ సంతోష్ విచారం వ్యక్తం చేశారు. ప్రధాని తనకు ఫోన్ చేసి కోవిద్ పరిస్థితి గురించి సవివరంగా చర్చిస్తే ఈ విధమైన ట్వీట్ ఇవ్వడం ఏమిటని సొరేన్ ను ప్రశ్నించారు. ఇటువంటి నేతలు తాము అధిరోహించిన పదవులకు తగిన కనీసం మర్యాద చూపడం లేదని విమరించారు. 

సొరేన్ ట్వీట్ ప్రజా జీవనంలో కనీసం మర్యాదను కూడా పాటించలేదని అస్సాం బీజేపీ నేత హేమంత్ బిస్వాస్ శర్మ విచారం వ్యక్తం చేశారు. “మీరు చాలా సంకుచితంగా వ్యవహరించారు. మీరున్న ముఖ్యమంత్రి హోదాను కించపరిచే విధంగా వ్యవహరించారు” అంటూ విమర్శించారు.