భారత్ నుంచి వచ్చే పౌరులపై నిషేధం ఎత్తేసిన ఆస్ట్రేలియా 

భారతదేశం నుంచి తిరిగి వచ్చే త‌మ‌ పౌరులపై నిషేధాన్ని వ‌చ్చే శ‌నివారం నుంచి ఆస్ట్రేలియా ఎత్తివేయ‌నున్న‌ది. స్వదేశానికి తిరిగి వచ్చే విమానం అదే రోజు డార్విన్ నగరంలో ల్యాండ్ అవుతుందని ప్రధాని స్కాట్ మోరిసన్ శుక్రవారం చెప్పారు. 

ఆస్ట్రేలియా ప్రభుత్వం చరిత్రలో తొలిసారిగా భారతదేశం నుంచి పౌరులు ఆస్ట్రేలియాకు రాకుండా తాత్కాలిక నిషేధం విధించింది. అయితే, ఇప్పుడు ఈ నిషేధం వచ్చే శనివారం నుంచి ఎత్తివేయనున్నారు.

గ‌తంలో విధించిన‌ నిషేధాన్ని పాటించనవారికి ఐదేండ్ల‌ జైలు శిక్ష లేదా 66 వేల ఆస్ట్రేలియన్ డాలర్ల జరిమానా విధించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయంపై అక్క‌డి ఎంపీలు, వైద్యులు, వ్యాపారవేత్తలు, పౌర సమాజం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. 

భారతదేశం నుంచి తిరిగి వచ్చే వారికి జ‌రిమానా విధించ‌డం, జైలుకు పంపుతామ‌ని చెప్ప‌డం అవివేక‌మ‌ని ముక్త‌కంఠంతో నిర‌సించారు. ప్రభుత్వ ఉత్తర్వు బహుశా మే 15 న ముగిసే అవ‌కాశాలు ఉన్నాయి. శుక్రవారం జరిగిన జాతీయ భద్రతా కమిటీ సమావేశం అనంత‌రం.. మోరిసన్ ఈ తేదీని మరింత పొడిగించాల్సిన అవసరం లేదని స్ప‌ష్టం చేశారు.

ప్రస్తుతం భారతదేశంలోని హైకమిషన్, కాన్సిలర్ కార్యాలయంలో నమోదు చేసుకున్న ఆస్ట్రేలియా పౌరులను మాత్రమే తిరిగి తీసుకువస్తామని మోరిసన్ వెల్ల‌డించారు. అందువల్ల ఆస్ట్రేలియా తన పౌరులను తిరిగి తీసుకురావడానికి మే 15 – 31 మధ్య భారతదేశం నుంచి మూడు విమానాలను న‌డుప‌నున్న‌ది. మొదటి విమానం మే 15 న డార్విన్‌కు చేరుకుంటుంది. భారతదేశం నుంచి నేరుగా ఆస్ట్రేలియాకు వాణిజ్య విమానాల‌ను ఇప్పటికే నిషేధించారు.

ఇలా ఉండగా, కొవిడ్-19 మహమ్మారిపై యుద్ధానికి పరస్పరం సహకరించుకోవాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ నిర్ణయించుకున్నారు. కరోనా వైరస్ కట్టడికి అవసరమైన వ్యాక్సిన్లు, మందులు సమానంగా అందరికీ అందుబాటులో ఉండాల్సిన ఆవశ్యకతపై వీరిద్దరూ పరస్పరం అంగీకారానికి వచ్చారు.

దీనిపై నిబంధనలతో కూడిన అంతర్జాతీయ విధానం కోసం, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత, పరస్పర సహకారంతో కూడిన విధానం ఏర్పాటుకు కలసి కట్టుగా కృషి చేయాల్సిన ఆవశ్యకతపై కూడా ఉభయులు చర్చించారు.

శుక్రవారం ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ  కొవిడ్-19 సెకండ్ వేవ్‌పై పోరాటంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం, ఆ దేశ పౌరులు అందచేస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.