కడప ముగ్గురాయి గనిలో భారీ పేలుడు.. 9 మంది మృతి 

కడపలోని ముగ్గురాయి గనిలో శనివారం భారీ పేలుడు సంభవించి తొమ్మిది మంది మృతి చెందారు. కలసపాడు మండలం మామిళ్లపల్లె వద్ద ఉన్న ముగ్గురాయి గనిలో బ్లాస్టింగ్‌ చేయడంతో భారీ పేలుడు చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో గనిలో దాదాపు 20 మందికి పైగా ఉన్నట్లు స్థానిక సమాచారం.

ముగ్గు రాళ్ల గనిలో ఉన్న 10 మంది కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురికి తీవ్రగాయాలైనట్లు సమాచారం. ముగ్గురాళ్లను తొలగించడానికి పేలుడు పదార్థాలను వినియోగించడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది.

ముగ్గురాయి గనుల్లో బ్లాస్టింగ్ కోసం వాహనంలో జిలెటిన్‌స్టిక్స్ తరలించారు. అన్‌లోన్‌ చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు జరిగింది. పేలుడు ధాటికి  వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ఘటనపై సీఎం జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. పేలుడు ఘటన జరగటానికి గల కారణాలను జగన్ ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు జగన్ మోహన్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

పేలుడు ఘటనపై మంత్రి ఆదిమూలపు సురేష్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనకు గల కారణాలను కలెక్టర్‌, ఎస్పీని అడిగి తెలుసుకున్నారు.  మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి సురేష్‌ హామీ ఇచ్చారు.