తమిళనాడు సీఎంగా స్టాలిన్‌ ప్రమాణస్వీకారం

తమిళనాడు ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ శుక్రవారం ఉదయం ప్రమాణస్వీకారం చేశారు. స్టాలిన్‌తో గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. కరోనా తీవ్రత దృష్ట్యా పరిమిత సంఖ్యలో వీవీఐపీలను మాత్రమే ప్రమాణస్వీకారోత్సవానికి ఆహ్వానించారు. 
 
69 ఏళ్ళ వయస్సులో ఐదు దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్నప్పటికీ తమిళ నాడు చరిత్రలో మొదటిసారిగా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వారిలో అతి ఎక్కువ వయస్సుగలవారు కావడం గమనార్హం.   మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీరుసెల్వం, మిత్రపక్షం కాంగ్రెస్ నేత పి చిదంబరం, ఎండీఎంకే అధినేత వైకో, మక్కల్ నీథి మయ్యం అధినేత కమల్ హాసన్ తదితరులు ప్రమాణస్వీకారంకు హాజరయ్యారు. 
 
స్టాలిన్ తో పాటు 34 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. గతంలో డీఎంకే ప్రభుత్వ హయాంలో మంత్రులుగా వ్యవహరించిన వారితోపాటూ యువకులు, కొత్త వారికి స్టాలిన్‌ అవకాశం ఇచ్చారు. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్‌ కూటమి ఘన విజయం సాధించిన సంగతి విదితమే.  రాష్ట్రంలో పదేళ్ల విరామం అనంతరం డీఎంకే తిరిగి అధికారమలోకి వచ్చింది.
 
మొత్తం 234 స్థానాలకు గానూ డీఎంకే కూటమి 118 సీట్ల మెజారిటీ మార్క్‌ను సునాయాసంగా దాటేసి, 156 సీట్లను గెల్చుకుంది. అన్నాడీఎంకే కూటమికి 78 సీట్లు లభించాయి. పార్టీల వారీగా డీఎంకే 131, కాంగ్రెస్‌ 17, సీపీఎం 2, సీపీఐ 2, వీసీకే 4 స్థానాల్లో విజయం సాధించాయి. ఎన్డీయే నుంచి అన్నాడీఎంకే 70, పీఎంకే 4, బీజేపీ 4 స్థానాల్లో విజయం సాధించాయి. డీఎంకే కూటమి 46.21 శాతం ఓట్లు సాధించగా, అన్నాడీఎంకే కూటమి 40.14 శాతం ఓట్లు సాధించింది.