తెలంగాణలో లాక్ డౌన్ విధించబొం 

తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ విధించబోమని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. లాక్‌డౌన్ విధించడం వలన ప్రజాజీవనం స్థంభించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదమున్నదని తెలిపారు. గత అనుభవాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో లౌక్ డౌన్ విధించినా కూడా పాజిటివ్ కేసులు తగ్గడం లేదనే విషయాన్ని పరిశీలించిన సిఎం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కరోనా పరిస్థితులపై గురువారం ప్రగతిభవన్‌లో సిఎం కెసిఆర్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. 

ఈ సందర్భంగా సిఎం రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులను కూలంకషంగా సిఎం సమీక్షించారు. ప్రస్తుతం ఎంతవరకు ఆక్సీజన్ అందుతున్నది ఇంకా ఎంతకావాలి..? వాక్సిన్‌లు ఎంత మేరకు అందుబాటులో వున్నవి రోజుకు ఎంత అవసరం..? రెమిడిసివర్ మందు ఏ మేరకు సప్లయి జరుగుతున్నది..? 

రాష్ట్రావసరాలకు రోజుకు ఎన్ని అవసరం అనే విషయాలను, ఆక్సీజన్ బెడ్ల లభ్యత వంటి విషయాల మీద పూర్తిస్థాయిలో చర్చించారు. రెమిడిసివర్ తయారీ సంస్థలతో సిఎం కెసిఆర్ ఫోన్లో మాట్లాడి వాటి లభ్యతను మరింతగా పెంచాలని కోరారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 9,500 ఆక్సీజన్ బెడ్లు వున్నాయని వాటిని హైదరాబాద్ సహా జిల్లాల్లో కలిపి మరోవారం రోజుల్లో వీటి సంఖ్యను మరో 5000కు పెంచాలని సిఎం అధికారులను ఆదేశించారు. మెరుగైన ఆక్సీజన్ సరఫరా కోసం ఒక్కోటి కోటి రూపాయల చొప్పున 12 క్రయోజనిక్ ట్యంకర్లను చైనా నుంచి వాయు మార్గంలో అత్యవసరంగా దిగుమతి చేయాలని ముఖ్యమంత్ర సిఎస్‌ను ఆదేశించారు. 

ఇందుకు సంబంధించి చర్యలను అత్యంత వేగంగా పూర్తిచేయాలని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యునిటీ హాస్పటల్స్, ఏరియా ఆస్పిటల్స్‌లలో మొత్తం 5,980 కొవిడ్ అవుట్ పేషెంట్ సెంటర్లు ఏర్పాటు చేశామని వీటి సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు.