ఏపీకి వెళ్లే బస్సులు నిలిపేసిన టీఎస్‌ ఆర్టీసీ

ఏపీలో క‌ర్ఫ్యూ కొన‌సాగుతున్న నేప‌థ్యంలో తెలంగాణ నుండి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు వెళ్లే బ‌స్సుల‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్న‌ట్లు రాష్ట్ర ఆర్టీసీ ఎండీ సునీల్ శ‌ర్మ తెలిపారు. ఉదయం నుండి వెళ్లే బస్సులు మధ్యాహ్నానికి చేరుకునే అవకాశం లేనందున ఈ నిర్ణయం తీసుకున్న‌ట్లు చెప్పారు. 

అదేవిధంగా తెలంగాణ నుండి ఏపీ మీదుగా ఇత‌ర రాష్ట్రాల‌కు వెళ్లే వాహ‌నాల‌ను సైతం నిలిపివేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఏపీ, తెలంగాణ‌ ఇరు రాష్ట్రాల మధ్య పూర్తిగా మెడిక‌ల్ ఎమ‌ర్జెన్సీ ఉన్న వాహ‌నాల‌ను మాత్ర‌మే అనుమ‌తిస్తున్న‌ట్లు తెలిపారు. ఏపీ ప్రభుత్వ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిబంధనలు వర్తించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

కరోనాతో ఇప్పటికే ఆర్టీసీ పీకల్లోతు నష్టాల్లోకి కూరుకుపోయింది. ప్రస్తుతం 50 శాతం బస్సులు మాత్రమే నడుస్తున్నాయి. సాధారణంగా రోజుకు రూ.12 కోట్ల నుంచి రూ. 13 కోట్ల దాకా ఆదాయం వస్తుండేది. ఇప్పుడు రూ. 4 కోట్లకు పడిపోయింది. ఏపీకి బస్సులు కూడా బంద్ కావడంతో ఆదాయం మరో రూ. 50 లక్షలు తగ్గనుంది. దీంతో ఆర్టీసీ ఆదాయం రోజుకు రూ. 3.5 కోట్లకు పడిపోనుంది.  

బుధవారం రాత్రి నుంచి బస్సులను నిలిపివేస్తున్నట్లు ప్రైవేట్‌‌ ట్రావెల్స్‌‌ ప్రకటించాయి. ప్రైవేట్ బస్సులు ఎక్కువగా రాత్రి వెళ్తుంటాయి. పైగా ప్యాసింజర్ల నుంచి కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ ఉంటేనే అనుమతిస్తామని అధికారులు చెప్పడంతో ట్రావెల్స్ బంద్ పెట్టాలని నిర్ణయించారు.