థ‌ర్డ్ వేవ్ త‌ప్ప‌దు.. సిద్ధంగా ఉండండి

క‌రోనా సెకండ్ వేవ్‌తోనే ఇప్పుడు దేశం అత‌లాకుత‌ల‌మ‌వుతోంది. అలాంటి స‌మ‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం క‌రోనా థ‌ర్డ్ వేవ్ త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించింది. దానికి సిద్ధంగా ఉండాల‌ని స్ప‌ష్టం చేసింది. ప్ర‌భుత్వానికి ప్రిన్సిప‌ల్ సైంటిఫిక్ అడ్వైజ‌ర్ అయిన కే విజ‌య‌రాఘ‌వ‌న్ ఈ హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. 

వేవ్‌ ఎప్పుడొస్తుంది?ఎలా వస్తుందో స్పష్టత లేనప్పటికీ ముప్పు తప్పదని స్పష్టం చేశారు. అంతేకాదు థర్డ్‌ వేవ్‌ నాటికి వైరస్‌ మరింతగా మారవచ్చని, భవిష్యత్‌లో మరిన్ని వేవ్‌లు వచ్చే అవకాశం ఎక్కువని తెలిపారు. కొత్త స్ట్రెయిన్‌ను ఎదుర్కొనేలా వ్యాక్సిన్‌ తయారు చేసుకోవాలని విజయరాఘవన్‌ సూచించారు. అయితే ప్రస్తుత వేరియంట్లపై వ్యాక్సిన్‌ బాగా పని చేస్తోందని తెలిపారు. 

వైర‌స్ కొత్త వేరియంట్లు చాలా వేగంగా సంక్రిమిస్తాయ‌ని ఆయ‌న తేల్చి చెప్పారు. కొవిడ్ ప‌రిస్థితి, రాష్ట్రాల్లో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌పై కేంద్ర ఆరోగ్య శాఖ నిర్వ‌హించిన సమావేశంలో ఆయ‌న పాల్గొన్నారు. క‌రోనా వైర‌స్ కొత్త వేరియంట్ల‌పై ప్ర‌పంచ‌వ్యాప్తంగా సైంటిస్టులు ప‌ని చేస్తున్నార‌ని ఈ సంద‌ర్భంగా కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది.

ఆ వేరియంట్ల‌ను ముందుగానే గుర్తించి వాటిని స‌మ‌ర్థంగా ఎదుర్కొనే దిశ‌గా చ‌ర్య‌లు చేప‌ట్ట‌నున్న‌ట్లు చెప్పింది. ఈ ప‌ని ఇండియాలోనూ జ‌రుగుతున్న‌ట్లు వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం వేరియంట్ల‌పై వ్యాక్సిన్లు స‌మ‌ర్థంగా ప‌ని చేస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం తెలిపింది. రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను బోల్తా కొట్టించేవి, వ్యాధి తీవ్ర‌త‌ను పెంచే లేదా త‌గ్గించే వేరియంట్లు రాబోతున్నాయ‌ని చెప్పింది.

దేశంలో మహమ్మారి అంతానికి, కొత్త రకం వైరస్‌లను ఎదుర్కోనేందుకు టీకాల పరిశోధనలను పెంచాల్సిన అవసరం ఉందని విజయరాఘవన్ హెచ్చరించారు. ఈ వైరస్ అధిక స్థాయిలో విజృంభిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని ఎదుర్కొనేందుకు పలు మార్పులు, కఠిన ఆంక్షలు, మార్గదర్శకాలు అవసరమని ఆయన పేర్కొన్నారు