బుద్గాంలో డీఆర్‌డీఓ 500 పడకల ద‌వాఖాన

 జ‌మ్ము కశ్మీర్‌ బుద్గాం జిల్లాలో 500 ప‌డ‌క‌ల ద‌వాఖాన‌ను డీఆర్‌డీఓ సిద్ధం చేస్తున్న‌ది. ఈ ప‌నుల‌న్నీ డీఆర్‌డీఓ ఆధ్వ‌ర్యంలో యుద్ధ‌ప్రాతిప‌దిక‌న జ‌రుగుతున్నాయి. రేషిపోరా గ్రామంలో ఈ ద‌వాఖాన‌ను ఏర్పాటుచేస్తున్నారు. ఈ ఆసుపత్రిలో 125 పడకల ఇంటెన్సివ్ కేర్ యూనిట్ సిద్ధం చేస్తున్నారు. ఇతర బెడ్ల‌కు కూడా ఆక్సిజన్ సరఫరా సౌకర్యం ఉంటుంది.

కశ్మీర్ డివిజనల్ కమిషనర్ పీకే పోలే రేషిపోరా గ్రామాన్ని సందర్శించి డీఆర్‌డీఓ 500 పడకల కొవిడ్ ద‌వాఖాన నిర్మాణ పనులను సమీక్షించారు. బుద్గాం డిప్యూటీ కమిషనర్ షాబాజ్ మీర్జాతో పాటు వివిధ విభాగాల సీనియర్ అధికారులు, డీఆర్‌డీఓ శాస్త్రవేత్త రవీంద్ర కుమార్ ఆసుపత్రి నిర్మాణ పనులను ప‌ర్య‌వేక్షించారు. 

ఈ ప్రాజెక్టు పనులను నెల‌ రోజుల్లో పూర్తి చేస్తామని డివిజనల్ కమిషనర్ షాబాజ్ మీర్జా తెలిపారు. ఈ ప్రాజెక్టులో వైద్యులు, పారామెడికల్ సిబ్బందికి 50 డబుల్ రూమ్ సౌకర్యాలు కూడా క‌ల్పిస్తున్నారు. యుద్ధ స్థాయిలో విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలని డిప్యూటీ కమిషనర్ అధికారులను ఆదేశించారు.

25 ఏళ్లకు పైగా లైఫ్ ఉండేలా థర్మల్ ఇన్సులేటెడ్ మెటీరియల్ ఇంజనీరింగ్‌తో ఆసుపత్రిని నిర్మిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా వైర‌స్ వ్యాప్తి నిలిచిపోయిన త‌ర్వాత దీనిని పూర్తి స్థాయి ద‌వాఖాన‌గా అభివృద్ధి చేస్తామని డిప్యూటీ కమిషనర్ షాబాజ్ మీర్జా తెలిపారు.