కాశ్మీర్ లో ముగ్గురు ముష్క‌రులు హ‌తం

జ‌మ్ముక‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదులు, భ‌ద్ర‌తా బ‌ల‌గాల మ‌ధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంట‌ర్‌లో ముగ్గురు ముష్క‌రులను సైన్యం మ‌ట్టుబెట్టింది. ద‌క్షిణ క‌శ్మీర్‌లోని షోపియాన్ జిల్లా క‌నిగామ్ ప్రాంతంలో ఉగ్ర‌వాదులు ఉన్నార‌నే స‌మాచారంతో స్థానిక పోలీసులు, భ‌ద్ర‌తా బ‌ల‌గాలు సంయుక్తంగా గాలింపు ప్రారంభించారు. 

మొత్తం న‌లుగురు ముష్క‌రులు ఉన్నార‌ని, వారున్న‌ ప్రాంతాన్ని చుట్టుముట్టిన భద్ర‌తా బ‌ల‌గాలు.. వారిని లొంగిపోవాల్సింగా కోరాయ‌ని క‌శ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. వారిలో ఒక‌రు లొంగిపోగా, మ‌రో ముగ్గురు సైన్యంపై కాల్పుల‌కు తెగ‌బ‌డ్డార‌ని వెల్ల‌డించారు. దీంతో భ‌ద్ర‌త బ‌ల‌గాల కాల్పుల్లో ముగ్గురు హ‌త‌మ‌య్యార‌ని తెలిపారు.

వారంతా అల్ బద‌ర్ అనే ఉగ్ర‌వాద సంస్థ‌కు చెందిన‌వార‌ని, న‌లుగురూ కొత్త‌గా చేరివారేన‌ని పేర్కొన్నారు. లొంగిపోయిన ఉగ్ర‌వాదిని తౌసిఫ్ అహ్మ‌ద్‌గా గుర్తించామ‌ని తెలిపారు. ఆప‌రేష‌న్ ఇంకా కొన‌సాగుతుంద‌ని, పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంద‌ని వెల్ల‌డించారు.

బారాముల్లా జిల్లా సోపోర్ నాథిపోరా ప్రాంతంలో మంగళవారం జరిగిన ఎన్ కౌంటరులో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల సంచారం పెరగడంతో భద్రతా బలగాల గాలింపును పెంచారు.