బెంగాల్ కు చేరుకున్న కేంద్ర బృందం… కేంద్ర మంత్రిపై దాడి

ప‌శ్చిమ బెంగాల్ లో ఎన్నిక‌ల అనంత‌రం చోటుచేసుకున్న హింసాకాండ‌పై వాస్త‌వాలు నిగ్గుతేల్చేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన న‌లుగురు స‌భ్యుల‌తో కూడిన నిజ నిర్ధార‌ణ బృందం గురువారం రాష్ట్రానికి చేరుకుంది. ఈ బృందం అసెంబ్లీ ఎన్నిక‌ల అనంత‌రం వివిధ ప్రాంతాల్లో జ‌రిగిన హింసాకాండ‌కు దారితీసిన ప‌రిస్థితుల‌ను అథ్య‌య‌నం చేయ‌డంతో పాటు క్షేత్ర‌స్ధాయి ప‌రిస్థితిని మ‌దింపు చేయ‌నుంది. 

హోం మంత్రిత్వ శాఖ అద‌న‌పు కార్య‌ద‌ర్శి సారథ్యంలో ఈ ప్ర‌తినిధి బృందం బెంగాల్ లో ప‌ర్య‌టించ‌నుంది. మ‌రోవైపు ఎన్నిక‌ల అనంత‌ర హింస‌పై త‌క్ష‌ణ‌మే స‌మ‌గ్ర నివేదిక‌ను పంపాల‌ని హోంమంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని కోరింది. స‌త్వ‌ర‌మే నివేదిక‌ను పంప‌ని ప‌క్షంలో ఈ వ్య‌వ‌హారాన్ని తీవ్రంగా ప‌రిగ‌ణిస్తామ‌ని మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించింది.

ఇలా ఉండగా, అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం పశ్చిమ‌బెంగాల్‌లో హింస చెల‌రేగిన నేప‌థ్యంలో ఆ రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌ల‌పై నివేదిక స‌మ‌ర్పించాల‌ని గ‌వ‌ర్న‌ర్ జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్‌ను కేంద్ర హోంశాఖ‌ కోరింది. ఈ విష‌యాన్ని కేంద్ర ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. బెంగాల్ గ‌త ఆదివారం అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ‌గానే ప‌లు ప్రాంతాల్లో తృణ‌మూల్ కాంగ్రెస్‌, బీజేపీ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌లు జరిగాయి. చాలాచోట్ల హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయి.

ఇదే సమయంలో, కేంద్ర మంత్రి వీ మురళీధరన్ కారుపై పశ్చిమ బెంగాల్‌లోని వెస్ట్ మిడ్నపూర్‌లో దాడి జరిగింది. దీంతో ఆయన తన పర్యటనను అర్థాంతరంగా కుదించుకున్నారు. ఈ వివరాలను మురళీధరన్ గురువారం ట్విటర్ వేదికగా వెల్లడించారు. 

పంచకుడిలోని స్థానికులు తన కాన్వాయ్‌పై దాడి చేశారని, కార్ల అద్దాలను పగులగొట్టారని, తన వ్యక్తిగత సిబ్బందిని గాయపరిచారని మురళీధరన్ ఇచ్చిన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ దాడికి సంబంధించిన వీడియోను కూడా ఆయన తన ట్వీట్‌కు జత చేశారు. ఇది టీఎంసీ గూండాల పనేనని ఆరోపించారు. తన పర్యటనను కుదించుకుంటున్నట్లు తెలిపారు.

కాగా, ఈ ఘ‌ట‌న‌ల‌పై తృణ‌మూల్ కాంగ్రెస్‌, బీజేపీ నేత‌ల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. తృణ‌మూల్ గూండాలే త‌మ కార్య‌క‌ర్త‌ల‌పై దాడికి పాల్ప‌డ్డార‌ని బీజేపీ నేత‌లు ఆరోపిస్తుండ‌గా, బీజేపీ గెలిచిన ప్రాంతాల్లోనే హింస చెల‌రేగింద‌ని బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జి విమ‌ర్శించారు. ఈ నేప‌థ్యంలో కేంద్ర హోంశాఖ ప‌శ్చిమ‌బెంగాల్ గ‌వ‌ర్న‌ర్ జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్‌ను రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌ల‌పై నివేదిక స‌మ‌ర్పించాల‌ని కోరింది.