బెంగాల్ లో రాజ‌కీయ హింస‌ను నిర్మూలిస్తాం

పశ్చిమ బెంగాల్లో కొనసాగుతున్న రాజకీయ హింసాకాండ నుంచి ప్రజలు, ప్రజాస్వామ్యాన్ని ‘‘కాపాడతామంటూ’’ ఇవాళ బీజేపీ చీఫ్ జేపీ నడ్డా శపథం చేశారు. కోల్‌కతా నడిబొడ్డున గాంధీ విగ్రహం వద్ద జరిగిన ధర్నాలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 
 
 అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం చోటుచేసుకున్న హింసాకాండ‌ను ప్ర‌స్తావిస్తూ ప్ర‌జ‌ల‌ను కాపాడే బాధ్య‌త క‌లిగిన వారే హింస‌కు బాధ్యుల‌ని న‌డ్డా ఆరోపించారు. వారు (టీఎంసీ) ప్ర‌మాణ స్వీకారం చేయ‌వ‌చ్చు..ప్ర‌జాస్వామ్యంలో ఇది వారి హ‌క్క‌ని అయితే బెంగాల్ లో రాజ‌కీయ హింస‌ను రూపుమాపేందుకు తాము కూడా ప్ర‌తినబూనామ‌ని స్ప‌ష్టం చేశారు.
 
ప్ర‌జా తీర్పును ఆమోదించి బాధ్య‌త క‌లిగిన విప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తామ‌ని చెప్పారు. బెంగాల్ లో రాజ‌కీయ హింస‌ను నిర్మూలించ‌డం, కొన్ని వ‌ర్గాలను ప్ర‌స‌న్నం చేసుకునే ప‌ద్ధ‌తుల‌కు స్వ‌స్తి ప‌ల‌క‌డం వంటి త‌మ క‌ర్త‌వ్యాల‌ను నెర‌వేర్చేందుకు పాటుప‌డ‌తామ‌ని పేర్కొన్నారు. 
 
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత రాష్ట్రంలో చోటుచేసుకున్న హింసను దేశం మొత్తాన్ని తెలియచెబుతామని నడ్డా పేర్కొన్నారు. ‘‘ఉత్తర 24 పరగణాలు సహా వివిధ జిల్లాల్లో పర్యటించి ఈ దుర్మార్గాన్ని ఎదుర్కొంటున్న మా పార్టీ కార్యకర్తలందరికీ అండగా ఉంటాం. దీని గురించి దేశం మొత్తాన్ని చెబుతాం..’’ అని నడ్డా పేర్కొన్నారు. 
 
అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ విజయం తర్వాత ఆ పార్టీ రగిలించిన హింస కారణంగా తమ పార్టీకి చెందిన ఆరుగురు కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారని బీజేపీ ఆరోపిస్తోంది. 
 
‘‘బెంగాల్ ప్రజలకు మా సేవలు కొనసాగుతాయి. వారి కలలు నెరవేరేవరకు అండగా ఉంటాం. ఈ రాజకీయ హింసా పర్వాన్ని ఛేదించేవరకు మేము పోరాడతాం..’’ అని నడ్డా పేర్కొన్నారు.