![కమల్ ను ఓడించి సంచలనం సృష్టించిన వనతి శ్రీనివాసన్ కమల్ ను ఓడించి సంచలనం సృష్టించిన వనతి శ్రీనివాసన్](https://nijamtoday.com/wp-content/uploads/2021/05/Vanathi-Srinivasan.jpg)
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో హీరో కమల్ హాసన్‌కు షాక్ తగిలింది. ‘మక్కల్ నీది మయ్యమ్’ పేరుతో పార్టీ పెట్టిన ఆయనకు తొలి ప్రయత్నంలో చేదు అనుభవం ఎదరైంది. తమిళనాడు ఎన్నికల్లో పార్టీ అధ్యక్షుడైన కమల్ సహా పార్టీ నేతలు ఎవరూ ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోయారు.
రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు రోజున.. ఉదయం నుంచి కమల్ హాసన్ బరిలో ఉన్న దక్షిణ కోయంబత్తూర్ నియోజకవర్గంలోనే పార్టీ ఆధిక్యంలో నిలిచింది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి వనతి శ్రీనివాసన్‌పై ఆయన ఆధిపత్యం కొనసాగిస్తూ వచ్చారు. అయితే చివరి రౌండ్లలో పుంజుకున్న ఆమె కమల్‌ను ఓడించారు.
ఇప్పుడు కమల్‌పై గెలిచిన ఆమె దేశ వ్యాప్తంగా సంచలనంగా మారారు. వనతి శ్రీనివాసన్ ఒక సీనియర్ అడ్వకేట్, తమిళనాడు కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు బీఎస్ జ్ఞానదేశికన్ వద్ద ఆమె 1993లో తన కెరీర్ ప్రారంభించారు. రెండు దశాబ్దాల పాటు లాయర్‌గా సేవలందించిన ఆమె.. 2002-2004 మధ్య కాలంలో భారత ప్రభుత్వానికి, దక్షిణ రైల్వేలకు స్టాండింగ్ కౌన్సిల్‌గా కూడా పనిచేశారు.
2012లో ఆమె చేసిన సేవకుగానూ అప్పటి మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉన్న జస్టిస్ ఇక్బాల్ చేతల మీదుగా అవుట్‌స్టాండింగ్ వుమెన్ లాయర్ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత వనతి రాజకీయాలవైపు అడుగులు వేశారు. అయితే ఒకవైపు రాజకీయాలు, మరోవైపు న్యాయవాద వృత్తి రెంటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్న ఆమె ప్రస్తుతం బీజేపీ మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు.
బీజేపీలో వనతి ప్రస్థానం మూడు దశాబ్దాలుగా కొనసాగుతోంది. 1993 నుంచి బీజేపీలో సభ్యురాలిగా ఉన్న ఆమె.. 1999 నుంచి పార్టీలో వివిధ కీలక పదవులు పోషించారు. 2013లో బీజేపీ తమిళనాడు రాష్ట్ర సెక్రటరీగా నియమితురాలైన ఆమె.. 2014 వరకూ ఈ పదవిలో ఉన్నారు. ఆ తర్వాత రాష్ట్ర బీజేపీ జనరల్ సెక్రటరీ పదవిని పొందారు.
2020 జూన్ వరకూ ఈ పదవిలో కొనసాగిన ఆమె.. రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షురాలిగా ఎదిగారు. 2020 అక్టోబరు 28న ఆమెను బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలిగా నియమించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. బీజేపీ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా ఆమెను ఈ పదవిలో నియమించారు.
బీజేపీ తరఫున 2016 ఎన్నికల్లో పోటీ చేసిన ఆమెకు 33,113 ఓట్లు వచ్చాయి. తాజా ఎన్నికల్లో కమల్ హాసన్‌పై 1728 ఓట్ల తేడాతో ఆమె విజయం సాధించారు. కనీసం పార్టీ అధ్యక్షుడైనా గెలుస్తాడని గంపెడాశలు పెట్టుకున్న ‘మక్కల్ నీది మయ్యమ్’ శ్రేణులకు ఆమె నిరాశే మిగిల్చారు.
పలు స్వచ్ఛంద సంస్థలు స్థాపించిన ఆమె.. చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఏసియన్ గేమ్స్‌లో మెడల్ సాధించిన శాంతి సుందరరాజన్‌కు మద్దతుగా జస్టిస్ ఫర్ శాంతి ఉద్యమం చేసి క్రీడల్లో మహిళలకు సెక్స్ వెరిఫికేషన్ టెస్టు లేకుండా చేశారు. కోయంబత్తూరులో నీటి వనరులను కాపాడటం కోసం కొన్ని ప్రాజెక్టులను ప్రారంభించారు.
వీటితోపాటు 2017లో కోవై మక్కల్ సేవై మైయ్యం అనే ఎన్జీవో, 2019లో న్యూ ఇండియా ఫోరంను ఏర్పాటు చేశారు. ఆమె దేశంలో సెక్సువల్ మైనార్టీల హక్కులకు బహిరంగంగానే మద్దతు ప్రకటించారు. ఎల్‌జీబీటీ కమ్యూనిటీ గురించి గోపి శంకర్ మదురాయి తమిళ భాషలో రచించిన తొలి పుస్తకాన్ని ఆమె ఆవిష్కరించారు.
1970 జూన్ 6న కోయంబత్తూరులోని తొడముత్తూర్ బ్లాకులో ఉలియంపాలాయం అనే గ్రామంలో వనతి జన్మించారు. కొండస్వామి, పూవతల్ ఆమె తల్లిదండ్రులు. తొడముత్తూర్‌లో స్కూలు విద్యనభ్యసించిన ఆమె.. హైయర్ సెకండరీ స్కూల్‌లో కెమిస్ట్రీ సబ్జెక్టులో బ్యాచ్ టాపర్‌గా నిలిచారు.
ఆ తర్వాత సీఎస్‌జీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజిలో చదువుకోవడానికి వెళ్లారు. ఆ తర్వాత సెల్ఫ్-ఎంప్లాయిమెంట్‌పై ఆసక్తి కలగడంతో లా చదివారు. చెన్నైలోని డాక్టర్ అంబేద్కర్ గవర్నమెంట్ లా కాలేజ్ నుంచి 1993లో పట్టా పొందారు. ఆపై అంతర్జాతీయ రాజ్యంగం విభాగంలో మద్రాస్ యూనివర్సిటీలో 1995లో మాస్టర్స్ పూర్తి చేశారు. సు. శ్రీనివాసన్‌ను వివాహమాడారు. వారికి ఇద్దరు అబ్బాయిలు.
More Stories
అన్న క్యాంటీన్లు ప్రయోజనమే… నిర్వహణకు ఓ కార్పొరేషన్ ఉండాలి!
జిహెచ్ఎంసి మేయర్ విజయలక్ష్మిపై అవిశ్వాసం?
ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రమాణంలో ప్రత్యేక ఆకర్షణగా ఉష