సీటీ స్కాన్ కాదు.. ఎక్స్‌రే తీయించుకోండి  

కొవిడ్ లక్షణాలు స్వల్పంగా ఉన్న వారు సీటీ స్కాన్ చేయించుకోవాల్సిన అవసరం లేదని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా  స్పష్టం చేశారు. సీటీ స్కాన్‌లో కనిపించే కొన్ని ప్యాచ్‌లు ఎలాంటి చికిత్స లేకుండానే మాయమైపోతాయని పేర్కొన్నారు.

లక్షణాలు లేని 30-40 శాతం మందిలో సీటీ స్కాన్ చేయించుకుంటే కొవిడ్ పాజిటివ్ అనే వస్తోందని పలు అధ్యయనాల్లో వెల్లడైందని తెలిపారు. అలాగే, అందులో కనిపించే ప్యాచ్‌లు ఎలాంటి చికిత్స లేకున్నా మాయమైపోతాయని చెప్పారు.

ఒక్క సీటీ స్కాన్ 300-400 ఎక్స్‌రేలకు సమానమని, అంతేకాక మున్ముందు కేన్సర్ బారినపడే అవకాశం కూడా ఉంటుందని హెచ్చరించారు. ముఖ్యంగా యువతలో ఈ ముప్పు మరింత ఎక్కువని తెలిపారు. కాబట్టి ఏదైనా అనుమానం ఉంటే తొలుత చాతీ ఎక్స్‌రే తీయించుకోవాలని, తప్పనిసరి పరిస్థితుల్లో సీటీ స్కాన్‌కు వెళ్లాలా? వద్దా? అనే దానిపై వైద్యులు సరైన సలహా ఇస్తారని గులేరియా పేర్కొన్నారు.

అలాగే, కరోనా పాజిటివ్‌గా తేలి, తేలికపాటి లక్షణాలు ఉన్న వారు రక్త పరీక్షలకు కూడా వెళ్లాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. బయోమేకర్స్ హానికరమని, సీటీ స్కాన్‌ను కూడా అత్యవసరమైతేనే చేయించాలని సూచించారు.

కరోనా తొలి దశలో స్టెరాయిడ్స్‌ను మోతాదుకు మించి తీసుకోవడం వల్ల న్యూమోనియాకు దారితీసే అవకాశం ఉందని, ఫలితంగా అది ఊపిరితిత్తుల్లోకి చేరే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తేలికపాటి కేసుల్లో సాధారణ మందులతో కొవిడ్ నయమైపోతుందని డాక్టర్ గులేరియా వివరించారు.