లాక్‌డౌన్ పరిష్కారం కాదు…. ప్రత్యామ్నాయాలూ చూడండి

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి అంతకంతకూ పెరిగిపోతోంది. దీనిని కట్టడి చేయడానికి ఇటు కేంద్రం, అటు రాష్ట్ర ప్రభుత్వాలు అహర్నిశలు శ్రమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర టాస్క్‌ఫోర్స్ కేంద్రానికి పలు సూచనలు చేసింది.  దేశంలో లాక్‌డౌన్ దిశగా అడుగులు వేయకుంటేనే బాగుంటుందని టాస్క్‌ఫోర్స్ సూచించింది. అయితే ఎక్కడా 10 మందికి మించి గుమిగూడకుండా చూసుకోవాలని పేర్కొంది. 

ఏదైనా కఠిన నిర్ణయం తీసుకునే ముందే దేశ ఆర్థిక స్థితిగతులను బేరీజు వేసుకుంటూ, అన్ని వర్గాల వారితో లోతైన సంప్రదింపులు జరిపిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. లాక్‌డౌన్‌  ఒక్కటే ఆప్షన్ కాదని, వివిధ రకాల ప్రక్రియలతో పరిస్థితిని అదుపులోకి తేవాలని సూచించింది.

దశల వారీగా చర్యలు చేపట్టాలని సూచించారు. కరోనా కేసులు అత్యధికంగా ఉన్న ప్రాంతాలపై దృష్టినిలిపి, తగు చర్యలు తీసుకోవాలని సూచించింది. అందరూ కలిసి పనిచేసేట్టుగా చూడాలని కూడా సూచించింది. స్థానిక పరిస్థితులను పూర్తిగా ఆకళింపు చేసుకొని మాత్రమే అక్కడ చర్యలు చేపట్టాలని, వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న ప్రాంతాల్లో కఠినమైన నిబంధనలను విధించాల్సి రావొచ్చు.

అయితే ప్రజల ప్రాణాలను కాపాడడమే ప్రాథమిక బాధ్యత అని, ప్రస్తుతమున్న మౌలిక సదుపాయాలను మరికొన్ని రోజుల్లోనే పెంచుకోవాలని, అవసరమైన వైద్య సిబ్బంది, ఆక్సిజన్ సరఫరా లాంటి అంశాలపై దృష్టి నిలపాలని టాస్క్‌ఫోర్స్ తన రిపోర్టులో పేర్కొంది.

జిల్లాలో ఉండే ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల సంఖ్యను పెంచాలని, అలాగే అగ్ని ప్రమాదాలను నిరోధించే విధంగా కూడా చర్యలు చేపట్టాలని పేర్కొంది. అలాగే ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలని, వెంటిలేషన్ బాగా వచ్చే విధంగా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా టాస్క్‌ఫోర్స్ సూచించింది. 

కాగా, దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర సర్కారు తీసుకుంటున్న చర్యలు.. తీసుకోవాల్సిన చర్యలపై  ఎప్పటికప్పుడు విచారణ జరుపుతున్న సుప్రీమ్ కోర్ట్ కేంద్ర,రాష్ట్రాలు ఈ సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలంటూ పలు సూచనలు చేసింది.

కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నసమయంలో సామూహిక సమావేశాలు, వేడుకలు అన్నింటిని కూడా బ్యాన్‌ చేస్తూ నిర్ణయం తీసుకోవాలి. అలాగే దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఆక్సీజన్ నిల్వలు అధికంగా ఉండేల చర్యలు తీసుకోండి. 

కోవిడ్ కేసులు అధికంగా నమోదు అవుతున్నాయి కనుక లాక్‌ డౌన్ పై కూడా ఆలోచిస్తే మంచిదని అత్యున్నత ధర్మాసనం సూచించింది. వైద్య సిబ్బందికి ఈ సమయంలో అన్ని వసతులు కల్పించాలి. అంతేకాదు వారి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలంటూ ఈ సందర్బంగా సుప్రీం కోర్టు సూచించింది.