ఎంపీలో జర్నలిస్టులు కరోనా యోధులు

కరోనా కేసులు పెరుగుదల నేపథ్యంలో మధ్య ప్రదేశ్  ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహమ్మారిపై పోరాటంలో ముందున్న జర్నలిస్టులను మధ్యప్రదేశ్‌లో ‘ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌’ ప్రకటించారు. పాత్రికేయులు కరోనాపై పోరాటంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్నారని, గుర్తింపు పొందిన వారందరినీ కరోనా యోధులుగా ప్రకటించాలని నిర్ణయించినట్లు చెప్పారు.

వారిని జాగ్రత్తగా చూసుకుంటామని పేర్కొన్నారు. ఇప్పటికే ఒడిశా బిహార్‌ ముఖ్యమంత్రులు నవీన్‌ పట్నాయక్‌, నితీశ్‌కుమార్‌ సైతం ఆయా రాష్ట్రాల్లో పెరుగుతున్న కొవిడ్‌ కేసుల మధ్య నిరంతరాయంగా సేవలందిస్తున్న పాత్రికేయులను కొవిడ్‌ యోధులుగా ప్రకటించారు. ఈ సందర్భంగా అవిశ్రాంతంగా సమాచారం చేరవేయడంతో పాటు కొవిడ్-19 సంబంధిత అంశాలపై ప్రజల్లో అవగాహన పెంచుతున్నారని ప్రశంసించారు. 

ఇదిలా ఉండగా.. దేశవ్యాప్తంగా గత నెల రోజుల్లో 52 మంది జర్నలిస్టులు మృతి చెందారు. నెలలో సగటున ఇద్దరు జర్నలిస్టులు మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పర్సెప్షన్‌ స్టడీస్‌ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. 

గతేడాది ఏప్రిల్‌ ఒకటి.. ఈ ఏడాది ఏప్రిల్‌ 20వ తేదీ మధ్య వంద మందికిపైగా జర్నలిస్టులు మహమ్మారి బారినపడి మృత్యువాతపడ్డారు. ఈ క్రమంలో జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్‌ వారియర్ల జాబితాలో చేర్చి, ఇతర ఫ్రంట్‌లైన్‌ వర్కర్ల మాదిరిగా వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యం ఇవ్వాలని ఎడిటర్స్‌ గిల్డ్‌ సైతం ఇటీవల కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.