కోవిద్ విధులు చేసేవారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యత 

కొవిడ్ విధులు నిర్వర్తిస్తున్న వైద్య నిపుణులు, ఆరోగ్య కార్యకర్తలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కొవిడ్ చికిత్సలో కనీసం వంద రోజులు సేవలు అందించిన వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. 

కొవిడ్ మేనేజ్‌మెంట్‌లో సేవలు అందించిన వారికి రాబోయే సాధారణ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీలో తొలి ప్రాధాన్యం ఇస్తామని తెలిపింది. అయితే, కొవిడ్ విధుల్లో వారు కనీసం వంద రోజులపాటు సేవలు అందించి ఉండాలని స్పష్టం చేసింది. 

ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణులు, చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులను కొవిడ్‌ విధుల్లో నియమించడానికి ప్రధాని మోదీ అనుమతి తెలిపారు. ఇందుకోసం నీట్‌ పీజీ పరీక్షను కనీసం నాలుగు నెలల పాటు వాయిదా వేశారు.  కరోనాను కట్టడి చేసేందుకు అందుబాటులో ఉన్న మానవ వనరులను సమర్థంగా వినియోగించుకోవాలన్న ఆలోచనలో భాగంగా ఈ నిర్ణయం తీసుకొన్నారు.

అలాగే, ఫాకల్టీ పర్యవేక్షణలో కొవిడ్ విధుల్లో మెడికల్ ఇంటర్న్స్‌ను అనుమతించాలని, ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్న వారి సేవలను టెలి కన్సల్టేషన్, తేలికపాటి లక్షణాలున్న కొవిడ్ కేసుల్లో ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. అయితే, ఇది కూడా ఫాకల్టీ పర్యవేక్షణలోనే సాగాలని స్పష్టం చేసింది.

ప్రధానమంత్రితో జరిగిన సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు పీఎంవో పేర్కొంది. వారి సేవలను వినియోగించుకోవడం ద్వారా ప్రస్తుతం ఉన్న వైద్యులపై పని భారం తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

ఎంబీబీఎస్‌ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ప్రత్యేక శిక్షణ అనంతరం వారి బోధకుల సమక్షంలో టెలీ కన్సల్టేషన్‌, కొవిడ్‌ లక్షణాలు మధ్యస్థంగా ఉన్నవారికి చికిత్స అందించవచ్చని పీఎంవో పేర్కొన్నది. బీఎస్‌సీ/జీఎన్‌ఎం నర్సింగ్‌లో ఉత్తీర్ణులైనవారు సీనియర్‌ వైద్యుల సమక్షంలో పూర్తి స్థాయిలో కొవిడ్‌ నిర్వహించవచ్చని తెలిపింది. 

100 రోజుల పాటు కొవిడ్‌ విధులు నిర్వహించిన విద్యార్థులకు భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు పేర్కొన్నది. అంతేకాకుండా వారికి కొవిడ్‌ నేషనల్‌ సర్వీస్‌ సమ్మాన్‌ పేరిట అవార్డులు ఇవ్వనున్నట్టు పీఎంవో వెల్లడించింది.

అలాగే, కొత్త బ్యాచ్‌లు వచ్చే వరకు మెడికల్ కాలేజీల్లో పీజీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థుల సేవలను కూడా ఉపయోగించుకోవాలని, గ్రాడ్యుయేట్ నర్సులు సీనియర్ వైద్యులు, నర్సుల పర్యవేక్షణలో పూర్తి సమయం కొవిడ్ నర్సింగ్ విధుల్లో ఉపయోగించుకోవచ్చని తెలిపింది. 

ఇలాంటి వాళ్లందరూ కొవిడ్ విధుల్లో కనీసం 100 రోజులు పూర్తిచేసుకుంటే వారికి ప్రభుత్వం భర్తీ చేసే ఉద్యోగాల్లో తొలి ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేసింది.