బెంగాల్ లో భారీ హింసాకాండ… 6గురు బిజెపి కార్యకర్తల హత్య!

ఎన్నికల ఫలితాల అనంతరం బెంగాల్‌లో సోమవారం భారీ హింసాకాండ చెలరేగింది. కోల్‌కతా, చుట్టు పక్కల ప్రాంతాల్లో దుండగులు కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. బీజేపీ కార్యాలయాలకు నిప్పు పెట్టారు. దుకాణాలను దోచుకొన్నారు.

 హింసాకాండలో ఓ మహిళ సహా ఆరుగురు బీజేపీ కార్యకర్తలు చనిపోయారని ఆ పార్టీ తెలిపింది. తృణమూల్‌ గూండాలే హింసకు కారణమని ఆరోపించింది. హింసాకాండ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. దుండగులు పిల్లలపై, జంతువులపై కూడా దాడులు జరిపారని బీజేపీ అధికార ప్రతినిధి అనిల్‌ బలూనీ వీడియోలు ట్వీట్‌ చేశారు. గాయాలతో ప్రజలు పారిపోతున్న దృశ్యాలు వీడియోల్లో ఉన్నాయి.

 బెంగాల్‌లో ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపై దాడులపై నివేదిక ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. మరోవైపు, తమ కార్యకర్తలు ముగ్గుర్ని బీజేపీ కార్యకర్తలు చంపేశారని తృణమూల్‌ ఆరోపించింది. హింసాకాండను సీఎం మమత ఖండించారు. తృణమూల్‌ కార్యకర్తలు సంయమనం పాటించాలని, బీజేపీ కార్యకర్తలు రెచ్చగొడితే రెచ్చిపోవద్దని సూచించారు.

బెంగాల్ లో పరిస్థితి చేజారుతున్నదని గవర్నర్ జగదీప్ ధంకర్ అభిప్రాయపడుతున్నారు. ఆదివారం నుంచి రాష్ట్రంలోని పలుచోట్ల చెలరేగుతున్న హింసాకాండపై చర్చించేందుకు ఆయన డీజీపి తదితర పోలీసు ఉన్నతాధికారులను రాజ్‌భవన్‌కు పిలిపించుకుని చర్చించారు. హింసాకాండ కట్టడికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

బెంగాల్ లో ఎన్నికల అనంతరం తమ కార్యకర్తలపై జరుగుతున్న హింసాకాండను బిజెపి సీరియస్ గా తీసుకొంది. ఈ హింసాకాండకు నిరసనగా మమతా బనెర్జీ ప్రమాణస్వీకారం చేయనున్న బుధవారం నాడు జాతీయ స్థాయిలో ధర్నాలు  చేబడుతున్నట్లు ప్రకటించింది. మరోవంక, రాష్ట్రంలో పరిస్థితులను పర్యవేక్షించడం కోసం బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా 4,5 తేదీలలో రాష్ట్రంలో పర్యటిస్తున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి,  రాష్ట్ర ఇన్ ఛార్జ్ కైలాష్ వర్గీయ ప్రకటించారు.