బెళగావి లోక్‌సభ సీటు బీజేపీ కైవసం

కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లోని 3 లోక్‌సభ స్థానాలు, 10 రాష్ట్రాల్లోని 12 అసెంబ్లీ సీట్లకు సంబంధించిన ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడ్డాయి. కర్ణాటకలో బెళగావి లోక్‌సభ స్థానంలో దివంగత కేంద్రమంత్రి సురేష్‌ అంగడి భార్య, బీజేపీ అభ్యర్థి అయిన మంగళ విజయం సాధించారు. 
 
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి లోక్‌సభ స్థానాన్ని వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గురుమూర్తి గెలిచారు. కేరళలో మళప్పురం లోక్‌సభ స్థానాన్ని ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ అభ్యర్థి అయిన అబ్దుస్సమాద్‌ సమాదాని గెలిచారు.
 
తమిళనాడులోని కన్యాకుమారి లోక్‌సభ స్థానంలో బీజేపీ నేత పొన్‌ రాధాకృష్ణన్‌ కంటే కాంగ్రెస్‌ నేత విజయ్‌ వసంత్‌ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక, కర్ణాటకలోని బసవకళ్యాణ అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యర్థి శరణు సలగర గెలిచారు. మస్కిలో కాంగ్రెస్‌ అభ్యర్థి బసవనగౌడ తురివనహాల్‌ గెలిచారు. 
 
రాజస్తాన్‌లో కాంగ్రెస్‌ 2 చోట్ల, మరో చోట బీజేపీ గెలిచాయి. గుజరాత్‌లో మర్వా హదాప్‌ స్థానంలో బీజేపీ నేత నిమిషా సత్తార్‌ గెలుపొందారు. ఉత్తరాఖండ్‌లోని సాల్ట్‌ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి మహేష్‌ గెలిచారు. తెలంగాణలోని నాగార్జునసాగర్‌ అసెంబ్లీ స్థానం నుంచి టీఆర్‌ఎస్‌ నేత నోముల భగత్‌ గెలిచారు. జార్ఖండ్‌లోని మధుపూర్‌లో జేఎఎం అభ్యర్థి హఫీజుల్‌ విజయం సాధించారు.