పుదుచ్చేరి ఎన్డీఏ కైవసం!

పుదుచ్చేరి ఎన్డీఏ కైవసం!
పుదుచ్చేరిలో ఆలిండియా ఎన్నార్‌ కాంగ్రెస్‌ సారథ్యంలోని ఎన్డీఏ అధికారం చేపట్టడానికి రంగం సిద్ధమైంది. మొత్తం 30 స్థానాలకు ఏఐఎన్‌ఆర్‌సీ కూటమి 16 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్‌ నేతృత్వంలోని కూటమి ఎనిమిది స్థానాల్లో గెలిచింది.
 
ఇండిపెండెంట్లు ఆరు స్థానాల్లో గెలిచారు. సీట్ల పరంగా చూస్తే, ఏఐఎన్‌ఆర్‌సీకి 10 సీట్లు రాగా.. మిత్రపక్షం బీజేపీకి 6 సీట్లు దక్కాయి. కాంగ్రెస్‌కు 2 సీట్లు దక్కగా.. మిత్రపక్షం డీఎంకేకు 6 స్థానాలు లభించాయి. ఇక, ఇతరులు ఆరుగురు విజయకేతనం ఎగుర వేసి ఉండడం రంగస్వామికి కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
 
తట్టన్‌చవడి స్థానం నుంచి ఎన్నార్‌ కాంగ్రెస్‌ అధినేత, మాజీ సీఎం ఎన్‌ రంగస్వామి గెలుపొందారు. మరోవైపు, పోటీ చేసిన 5 స్థానాల్లోనూ అన్నాడీఎంకే అభ్యర్థులు ఓడిపోయారు. పుదుచ్చేరిలో ఆ పార్టీకి ప్రాతినిధ్యం లభించకపోవడం 1980 తర్వాత ఇదే తొలిసారి.
పుదుచ్చేరిలో పాగా వేయడం లక్ష్యంగా బీజేపీ ఆది నుంచి వ్యూహాల్ని పదును పెడుతూనే వచ్చింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత మరొకరు రాజీనామా చేసి బీజేపీ, ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ల వైపుగా వెళ్లడంతో సీఎం నారాయణ స్వామి ప్రభుత్వం కుప్పకూలింది. దీంతో పుదుచ్చేరిలో రాజకీయం రసవత్తరంగా మారింది.