కేరళలో చరిత్ర తిర‌గ‌రాసిన విజయన్ 

కేరళ రాష్ట్రంలో ఐదేండ్లకోసారి ఎల్డీఎఫ్‌, యూడీఎఫ్ కూటములు అధికారంలోకి వస్తుంటాయి. ప్రతి ఐదేండ్లకోసారి ప్రజలు మార్పును కోరుకుంటారని ఇప్పటివరకు అనుకునేవారు. ఆ ఆనవాయితీకి ఇప్పుడు తిలోదకాలిచ్చారు. ప్రతి ఐదేండ్లకు ఒకసారి ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయానికి ఈసారి తెరపడింది.

1980 నుంచి కేరళలో ప్రతి ఐదేండ్లకు ఒకసారి అధికార మార్పిడి జరుగుతూనే ఉన్నది. అయితే, ప్రస్తుతం ఈ సంప్రదాయానికి మలయాళీలు స్వస్తి పలికినట్లు ప్రస్తుత ఎన్నికల సరళిని బట్టి తెలుస్తున్నది. లోక్‌సభ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ కూటమి ఘోర పరాజయం మూటగట్టుకున్నా.. అసెంబ్లీ ఎన్నికలకు మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కేరళలో కరోనా కట్టడికి విజయన్ ప్రభుత్వం అనుసరించిన వ్యూహం మోడల్‌గా నిలిచింది. 

ఈ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ విజయానికి ముఖ్యమంత్రి విజయన్ చరిష్మా ప్రధాన కారణంగా నిలిచిందని వామపక్ష కార్యకర్తలు బాహాటంగా చెప్తుంటారు. కేరళలో రాజకీయ ప్రకంపనలు రేపిన బంగారం అక్రమ రవాణా కుంభకోణంలో అరెస్టులు, సోదాలు.. విజయన్ ప్రభుత్వంపై ఏ మాత్రం ప్రభావం చూపలేదని తాజా ఫలితాలతో రుజువైంది.

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం పినరయి విజయన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎల్డీఎఫ్‌కు అయ్యప్పస్వామి దీవెనలు ఉన్నాయని చెప్పారు. అయ్యప్పతోపాటు ఈ నేలపై ఉన్న ఇతర మత విశ్వాసాలకు చెందిన దేవుళ్లు కూడా తమ ప్రభుత్వాన్ని దీవిస్తారని పినరయి పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ప్రజలను రక్షిస్తున్నందున.. దేవుడు తమ పార్టీని రక్షిస్తాడని, అన్ని మతాల దేవుళ్ల దీవెనలతో మరోసారి అధికారంలోకి వస్తాం అని తెలిపారు.

కేరళ రాజకీయాలలో విజయం ఇప్పుడు బలమైన నాయకుడిగా ఎదిగారు. ఆ రాష్ట్రానికి చెందిన‌ ఈఎంఎస్ నంబూద్రిపాద్‌, ఏకే గోపాల‌న్‌, , పీ కృష్ణ పిళ్లై, సీహెచ్ క‌న‌ర‌న్ లాంటి వాళ్లు కూడా విజ‌య‌న్ లాంటి విజ‌యాన్ని అందుకోలేదు. కేర‌ళ రాష్ట్ర చ‌రిత్ర‌లో వ‌రుస‌గా రెండ‌వ సారి సీఎం ప‌ద‌విని ద‌క్కించుకున్న ముఖ్య‌మంత్రిగా విజ‌య‌న్ కొత్త రికార్డు సృష్టించారు. 

విజ‌య‌న్ త‌న త‌ల్లికి 14వ సంతానంగా జ‌న్మించారు. నాస్తికుడిగా ఎదిగిన విజ‌య‌న్ త‌న పార్టీకి మాత్రం క‌ట్టుబ‌డి ప‌నిచేశారు. విజ‌య‌న్ తండ్రి క‌ల్లుగీత కార్మికుడు. 1960 ద‌శ‌కంలో విజ‌య‌న్ సీపీఎంలో స‌భ్య‌త్వం తీసుకున్నారు. గ‌వ‌ర్న‌మెంట్ కాలేజీలో బీఏ చ‌దువుకున్న విజ‌య‌న్‌.. క‌న్నూరు జిల్లాలో విద్యార్థి నాయ‌కుడిగా అప్ప‌ట్లో రాణించారు. అర‌య‌కండి అచ్చుత‌న్ వ‌ద్ద రాజ‌కీయ శిష్య‌రికం చేశారు.

1945లో పుట్టిన విజ‌య‌న్ ఓ ద‌శ‌లో మావో లైను ప‌ట్ల ఆక‌ర్షితుల‌య్యారు. దాదాపు న‌క్స‌లైట్‌గా మారారు. కానీ సీనియ‌ర్ నేత‌లు అప్ప‌ట్లో ఆయ‌న్ను మ‌ళ్లీ సీపీఎం వైపు లాక్కు రావ‌డంలో స‌క్సెస్ అయిన‌ట్లు తెలుస్తోంది. 1970లో విజ‌య‌న్ 25 ఏళ్ల వ‌య‌సులో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు.  ఆ త‌ర్వాత తెర‌వెనుక రాజ‌కీయ‌వేత్త‌గా త‌న ప‌థ‌కాల‌ను ర‌చించారు. ఎమ‌ర్జెన్సీ స‌మ‌యంలో ఎంవీ రాఘ‌వ‌న్‌తో క‌లిసి జైలు జీవితం గ‌డిపారు.