ఏప్రిల్‌లో రికార్డు స్థాయికి జీఎస్టీ  వసూళ్ళు

ఒకవైపు కరోనా విజృంభిస్తున్నప్పటికీ మరో వైపు పన్ను వసూళ్ళ జోరు తగ్గలేదు. గత నెలలో ఏకంగా రూ.1.41 లక్షల కోట్ల మేర వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూలైనట్లు ఆర్థిక మంత్రి త్వ శాఖ తాజాగా వెల్లడించింది. మార్చి నెలలో వసూలైన రూ. 1.23 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 14 శాతం అధికమవడం గమనార్హం. 

వరుసగా ఏడు నెలలుగా లక్ష కోట్లకు పైగా వసూలవగా..ఈ పన్నుల విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ఇంత భారీ మొత్తంలో వసూలవడం ఇదే తొలిసారి కావడం విశేషం. దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకుంటున్నట్లు ఈ పన్ను వసూళ్ళు సంకేతాలు ఇస్తున్నాయని, ఫేక్‌ బిల్లులపై ప్రత్యేక దృష్టిసారించడం కూడా పన్ను వసూళ్ళు పెరగడానికి దోహదం చేశాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి.

గత నెలలో మొత్తంగా రూ.1,41, 384 కోట్ల మేర జీఎస్టీ వసూలవగా.. దీంట్లో సెంట్రల్‌ జీఎస్టీ కింద రూ. 27,837 కోట్లు, ఎస్‌జీఎస్టీ కింద రూ. 35,621 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ. 68,481 కోట్లు, సెస్‌ రూపంలో రూ. 9445 కోట్ల మేర వసూలైనట్లు తెలిపింది. 

కరోనా రెండో దశ ఉదృతితో గత నెల దేశవ్యాప్తంగా పలుచోట్ల లాక్‌డౌన్‌ తరహా ఆంక్షలు అమల్లోకి వచ్చి వ్యాపారాలపై ప్రభావం చూపిస్తున్నప్పటికీ దేశీయ వ్యాపారులు సరైన సమయంలో జీఎస్టీ బకాయిలు చెల్లించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. 

లాక్‌డౌన్‌ కారణంగా గతేడాది ఏప్రిల్‌ నెలలో కేవలం రూ.32,172 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. అయితే ప్రస్తుత నెలల్లో పన్ను వసూళ్ళు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నదని పన్ను విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ కారణంగా పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ విధించడం ఇందుకు కారణమని విశ్లేషించారు.