మమతా భద్రతాధికారికి సీబీఐ సమన్లు

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ చీఫ్ మమత బెనర్జీ భద్రతాధికారి జ్ఞానవంత్ సింగ్‌కు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) శనివారం నోటీసు ఇచ్చింది. మే 4న కోల్‌కతాలోని సీబీఐ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించింది. బొగ్గు కుంభకోణం కేసులో ఆయనను ప్రశ్నించనున్నట్లు తెలిపింది.

మమత బెనర్జీ భద్రతా విభాగం డైరెక్టర్‌గా సింగ్‌ను ఈ ఏడాది మార్చిలోనే నియమించారు. అంతకుముందు ఈ పదవిని వివేక్ సహాయ్ నిర్వహించేవారు. నందిగ్రామ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మమత బెనర్జీకి ప్రమాదం జరగడంతో వివేక్‌ను ఆ పదవి నుంచి తొలగించి, సింగ్‌ను నియమించారు. 

జ్ఞానవంత్ సింగ్‌ అంతకుముందు అడిషినల్ డైరెక్టర్ జనరల్ (సెక్యూరిటీ)గా వ్యవహరించేవారు. ఆయన మమత బెనర్జీకి విశ్వాసపాత్రుడని సమాచారం. బొగ్గు కుంభకోణం కేసులో టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ సతీమణి రుజిరను సీబీఐ గతంలో ప్రశ్నించింది.