ఒంటరిగా ఈటెల.. మంత్రులు, ఎమ్యెల్యేలు దూరం!

అర్ధాంతరంగా భూకబ్జా ఆరోపణలపై స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దర్యాప్తుకు ఆదేశించడం, ఆరోపణలను బలపరుస్తూ అధికారులు నివేదిక ఇవ్వడం, ఈ లోగా ఆయన చేతిలోని వైద్య, ఆరోగ్య శాఖను సీఎం తీసేసుకొని ఏ శాఖలోని మంత్రిగా మిగిల్చిన ఈటెల రాజేందర్ ఇప్పుడు సొంత పార్టీలో ఒంటరిగా మిగిలారు. సహచర మంత్రులు, ఎమ్యెల్యేలు ఎవ్వరు నోరు మెదపడం లేదు. 

కనీసం ఆయనను ఎవ్వరు పలుకరించినా దాఖలాలు కూడా లేవు. కనీసం మాట్లాడే ప్రయత్నమూ చేయలేదు. తోటి మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయనకు దూరంగా ఉంటున్నారు. మొన్నటిదాకా వివిధ పనుల కోసం ఆయన ఇంటికివెళ్లే టీఆర్​ఎస్​ నేతలు,  ఇప్పుడు అటువైపు చూసేందుకూ జంకుతున్నారు. కేవలం ఆయన అనుచరులు తప్ప అంతా ఈటలను దూరం పెట్టారు. 

ఏడాదిన్నర క్రితం ‘గులాబీ జెండా ఓనర్లం’ అని ఈటల చేసిన కామెంట్లు తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. దీంతో జీహెచ్​ఎంసీ ఎన్నికల తర్వాత తెలంగాణ భవన్​లో పెట్టిన మీటింగ్​లో సీఎం.. ఈటలను ఉద్దేశించి చేసిన పరోక్ష వ్యాఖ్యలతో అప్పటి నుంచే ఈటలకు పార్టీ నేతలు  దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. 

ఇప్పుడు ఈటలమీద ఆరోపణలపై సీఎం కేసీఆర్​ స్వయంగా విచారణకు ఆదేశించడంతో ఆయనతో మాట్లాడేందుకు వెనుకడుగు వేస్తున్నారు. కొందరు నేతలు మాత్రం తమ సన్నిహితుల ఫోన్ల నుంచి ఈటలతో మాట్లాడినట్టు తెలుస్తోంది.  మొన్నటిదాకా ఈటలతో ఎంతో సన్నిహితంగా మెలిగిన కరీంనగర్​ నేతలూ ఆయన్ను కలవాలంటే భయపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈటలను కలిసినా, ఆయనతో మాట్లాడినా తమకే నష్టమన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఫోన్లను ట్యాప్​ చేస్తారన్న భయంతో ఫోన్​ చేయాలన్నా వెనుకడుగు వేస్తున్నారు.

ఈటలతో ఎవరూ ఏం మాట్లాడొద్దంటూ మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇప్పటికే ప్రగతి భవన్​ నుంచి ఆదేశాలు వెళ్లినట్టు సమాచారం. శామీర్​పేటలోని ఈటల ఇంటి వద్ద కూడా ప్రత్యేక నిఘా టీమ్​లను ఏర్పాటు చేశారన్న మాటలు వినిపిస్తున్నాయి. ఆయన ఇంటికి ఎవరెవరు వస్తున్నారు? ఏం మాట్లాడుతున్నారన్న విషయాలను ఆరా తీస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

ఈటలకు మద్దతుగా ఉన్న కొందరు బీసీ సంఘాల నేతలకూ ప్రగతి  భవన్​ నుంచి ఫోన్లు వెళ్లాయని, మద్దతును ఉపసంహరించుకోవాలంటూ హెచ్చరించారని చెబుతున్నారు. ఈటల అంశాన్ని ప్రశ్నిస్తే.. ఆ విషయం గురించి తామేమీ మాట్లాడబోమని, అన్నీ కేసీఆరే చూసుకుంటారని మంత్రులు చెబుతున్నారు. కేసీఆర్​ కన్నెర్రచేసిన నేతలెవరితోనూ తోటి నేతలు మాట్లాడరంటూ పార్టీకి చెందిన ఓ సీనియర్​ నేత గుర్తు చేశారు. ఆ నేత  ఎదురుపడినా చూడకుండా పోతారని, ఎవరైనా మాట్లాడితే వాళ్లపని  అంతేనని ఉద్యమకాలం నుంచి పార్టీలో ఉన్న ఆ నేత చెప్పారు.