ఆక్సిజ‌న్ ర‌వాణాకు.. స‌ముద్ర సేతు 2 మిష‌న్‌

క‌రోనా సెకండ్ వేవ్ దేశాన్ని అత‌లాకుత‌లం చేస్తున్న‌ది. దేశ‌వ్యాప్తంగా రోజువారీ క‌రోనా కేసుల సంఖ్య 4 ల‌క్ష‌ల‌కు చేరుగా, మ‌ర‌ణాలు మూడు వేలు దాటాయి. ఆసుప‌త్రుల‌న్నీ క‌రోనా రోగుల‌తో నిండిపోయాయి. ఈ నేప‌థ్యంలో ఆక్సిజ‌న్‌, ఔష‌ధాల‌కు బాగా డిమాండ్ పెరిగింది. ఆక్సిజ‌న్ కొర‌త వ‌ల్ల గ‌త కొన్ని రోజులుగా క‌రోనా రోగులు ప‌దుల సంఖ్య‌లో మ‌ర‌ణిస్తున్నారు.

ఇలాంటి ప‌రిస్థితుల్లో భార‌త నౌకాద‌ళం స‌ముద్ర సేతు 2 ఆప‌రేష‌న్‌ను ప్రారంభించింది. ఈ మిష‌న్‌లో భాగంగా విదేశాల నుంచి ఆక్సిజ‌న్ కంటైన‌ర్ల‌ను యుద్ధ నౌక‌ల ద్వారా భార‌త్‌కు ర‌వాణా చేస్తారు. ఐఎన్‌ఎస్ కోల్‌కతా, ఐఎన్‌ఎస్ తల్వార్ యుద్ధ నౌక‌లు ఇప్ప‌టికే బహ్రెయిన్‌లోని మనామా పోర్టుకు చేరాయి.

40 మెట్రిక్ ట‌న్నుల ద్రవ ఆక్సిజన్ కంటైన‌ర్ల‌ను ముంబైకి రవాణా చేస్తాయి. అలాగే ఆక్సిజ‌న్ త‌ర‌లింపు కోసం ఐఎన్ఎస్ జలశ్వా బ్యాంకాక్‌కు, ఐఎన్ఎస్ ఐరావత్ సింగపూర్‌కు బ‌య‌లుదేరాయి.

క‌రోనా నేప‌థ్యంలో విదేశాల్లో చిక్కుకుపోయిన భార‌తీయుల‌ను స్వ‌దేశానికి తీసుకొచ్చేందుకు భార‌త నౌకాద‌ళం గత ఏడాది స‌ముద్ర సేతు మిష‌న్ చేప‌ట్టింది. ఇందులో భాగంగా ప‌లు దేశాల‌కు వెళ్లిన యుద్ధ నౌక‌లు వేలాది మంది భార‌తీయుల‌ను జ‌ల‌మార్గాల ద్వారా వారి సొంత రాష్ట్రాల‌కు చేర్చాయి.