తెలంగాణాలో ప్రైవేట్ ఆసుపత్రుల నిలువు దోపిడీ 

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అవసరమైనంత ఆక్సిజన్ కేటాయించిందని రెండు రోజుల క్రితం చెప్పిన రాష్ట్ర వైద్య మంత్రి ఈటల రాజేందర్. ఇంతలోనే మాట మార్చారు. ఆక్సిజన్, రెమ్డిసివిర్‌‌‌‌, వ్యాక్సిన్ కొరతకు కేంద్ర ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. రాష్ట్రాలకు అడిగినంత ఆక్సిజన్ ఇవ్వడం లేదని, కేంద్రం వద్ద డబ్బులు లేకుంటే రాష్ట్రాలను అడగాలని అంటూ అహంకార ధోరణి ప్రదర్శించారు. 

రాష్ట్రంలో కరోనాపై కేసీఆర్ ప్రభుత్వం చేతులెత్తేసి, ప్రైవేట్ ఆసుపత్రుల నిలువు దోపిడీకి అడ్డు, అదుపు లేక పోవడంతో నిస్సహ స్థితిలో మంత్రి రాజేందర్ ఈ విధంగా మాట్లాడుతున్నట్లు కనిపిస్తున్నది. 

మరోవంక కరోనా చికిత్స పేరిట కార్పొరేట్​, ప్రైవేట్​ ఆస్పత్రులు అడ్డగోలుగా వసూళ్లు చేస్తున్నాయి కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించిన ఫీజులను కాదని ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నాయి. కనీసం లక్షన్నర అడ్వాన్స్ కడితేనే పేషెంట్స్ ను చేర్చుకుంటున్నాయి. లేదంటే బెడ్స్ ఖాళీగా లేవని సాకులు చెప్పి.. గేటు దగ్గరే వెనక్కి పంపిస్తున్నాయి. 

ఆక్సిజన్ అవసరం ఉన్న పేషెంట్స్ విషయంలో కార్పొరేటు ఆస్పత్రులు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఆక్సిజన్ తో ట్రీట్​మెంట్ అయితే కనీసం రోజుకు రూ.2 లక్షలు ఫీజు వసూలు చేస్తున్నాయి. మరోవైపు హెల్త్ ఇన్సూరెన్స్ లకు ట్రీట్​మెంట్ లేదని, ముందు ఫీజు చెల్లించి ఆ తర్వాత రీయింబర్స్ మెంట్ పెట్టుకోవాలని ఉచిత సలహాలు ఇస్తున్నాయి. 

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు, కార్పొరేటు ఆస్పత్రుల ఆగడాలపై వేలాది ఫిర్యాదులు వస్తున్నా.. ప్రభుత్వంలో మాత్రం కదలిక లేదు. ఇప్పటిదాకా ఏ ఆస్పత్రిపైనా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
రాష్ట్రవ్యాప్తంగా 1,045 ప్రైవేటు ఆస్పత్రులు కరోనా ట్రీట్​మెంట్ ఇస్తున్నాయి. ఇందులో సుమారు 700 హాస్పిటల్స్ ఫీజులు లక్షల్లో వసూలు చేస్తున్నాయి. 

ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం కేంద్రంగా పనిచేస్తున్న కార్పొరేటు హస్పిటళ్లు భారీగా గుంజుతున్నాయి. పేషెంట్ ను చేర్చుకోవాలని బంధువులు ఫోన్ చేయగానే ముందు ఫీజు గురించి తేల్చిచెబుతున్నాయి. పరిస్థితి విషమించిన తర్వాత పేషెంట్ వస్తే.. పండుగ చేసుకుంటున్నాయి. 

ప్రైవేటు హాస్పిటల్స్ దోపిడీపై రోజుకు వందలాది ఫిర్యాదులు వస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం కరోనా చికిత్స కోసం 104 కాల్ సెంటర్ ను, వాట్సాప్ ద్వారా సలహాలు తీసుకునేందుకు ఫోన్ నంబర్ 9154170960ను ఏర్పాటు చేశారు. ఫీజుల దోపిడీపై ఇప్పటిదాకా సుమారు 3,700 దాకా ఫిర్యాదులు వచ్చినట్టు ఆఫీసర్లు చెప్తున్నారు. 

రోజూ వచ్చే ఫిర్యాదులను కాల్ సెంటర్ ఇన్ చార్జులు ప్రభుత్వానికి పంపుతున్నారు. కానీ ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే కార్పొరేటు ఆస్పత్రులపైనే ఎక్కువ సంఖ్యలో కంప్లైట్స్ వస్తున్నట్టు తెలిసింది.

తర్వాత రోజుకు రెండు లక్షల మేర ఫీజు వసూలు చేస్తున్నాయి. వారం రోజులు చికిత్స తీసుకుంటే రూ.10 లక్షల నుంచి 15 లక్షల దాకా వేస్తున్నాయి. కార్పొరేటు ఆసుపత్రుల్లో ట్రీట్​మెంట్ కోసం ఏ రోజు బిల్లు అదే రోజు చెల్లించాలి. చెక్, క్రెడిట్, డెబిట్​కార్డు, ఆన్ లైన్ బ్యాంకింగ్ ద్వారా కడుతామంటే ఒప్పుకోవడం లేదు. 

అలా తీసుకుంటే.. ఇన్​కమ్ ట్యాక్స్ లెక్కలు చూపించాల్సి వస్తుందనే కారణంతో క్యాష్ రూపంలో ఫీజులు వసూలు చేస్తున్నాయి. దీంతో నగదు కోసం పేషెంట్ల బంధువులు తెలిసిన వారి వద్ద అప్పులు చేస్తున్నారు. అలా కుదరకపోతే తమ దగ్గరున్న బంగారం, ఇతర ఆస్తులను కుదవపెడుతున్నారు. 

గత ఏడాది కరోనా వచ్చిన టైమ్ లో చాలా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు భారీగా పాలసీలు చేయించాయి. కానీ కార్పొరేటు ఆసుపత్రులు మాత్రం ఇన్సూరెన్స్ ద్వారా ట్రీట్​మెంట్ చేయలేమని, ముందుగా ఫీజు కట్టాలని స్పష్టం చేస్తున్నాయి. తర్వాత ఫీజు రీయింబర్స్​మెంట్ కోసం కావాల్సిన డాక్యుమెంట్స్ ఇస్తామని చెబుతున్నాయి.

హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ లో కార్పొరేటు, ప్రైవేటు ఆస్పత్రుల ఓనర్లు ప్రభుత్వ పెద్దలకు సన్నిహితులనే కారణంతో చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. అందుకే తమపై ఫిర్యాదులు వచ్చినా ఏం కాదనే ధీమాతో ఆస్పత్రులు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. 

రూల్స్​కు వ్యతిరేకంగా ఫీజులు వసూలు చేస్తున్నారని ప్రశ్నిస్తే ఎదురు దాడి చేసే పరిస్థితులు ఉన్నాయని ఆవేదన చెందుతున్నారు. ఏదైనా ఒక్క ఆసుపత్రిపై చర్యలు తీసుకున్నా.. మిగతావి దారికొస్తాయని ప్రభుత్వంలో కీలక హోదాలో పనిచేస్తోన్న ఆఫీసర్లు అంటున్నారు. కానీ ప్రభుత్వ పెద్దల ఆలోచన మాత్రం ప్రైవేటు ఆస్పత్రులకు మద్దతు పుష్కలంగా ఉన్నట్టు కనిపిస్తోందని చెబుతున్నారు.

మంత్రులు, ఐఏఎస్ లకు సహితం ప్రైవేటు హాస్పిటల్స్ షాక్ ఇస్తున్నాయి. తాము చెప్పినంత కట్టాల్సిందేనని, ఫీజు తగ్గించే ప్రసక్తి లేదని స్పష్టం చేస్తున్నాయి. కరోనా చికిత్స చేయించుకున్న తమ బంధువులు, సన్నిహితులకు ఫీజు తగ్గించాలని కొందరు మంత్రులు, ఐఏఎస్ లు.. ప్రైవేటు హాస్పిటల్స్ ను సంప్రదించినప్పుడు వారికి చేదు అనుభవాలు ఎదురైనట్టు తెలిసింది.