రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రి గెహ్లాట్‌కు క‌రోనా పాజిటివ్

రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రి గెహ్లాట్‌కు క‌రోనా పాజిటివ్

రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లాట్‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. ఈ మేర‌కు సీఎం గెహ్లాట్ ట్వీట్ చేశారు. త‌న‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయిన‌ప్ప‌టికీ ఆరోగ్యంగా ఉన్నాన‌ని తెలిపారు. త‌న‌కు ఎలాంటి క‌రోనా లక్ష‌ణాలు లేవ‌ని చెప్పారు. కొవిడ్ నిబంధ‌న‌ల ప్ర‌కారం తాను హోం ఐసోలేష‌న్‌లో ఉన్నాన‌ని పేర్కొన్నారు. 

గెహ్లాట్ భార్య సునీత‌కు బుధ‌వారం క‌రోనా పాజిటివ్ అని తేలింది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న కూడా ప‌రీక్ష‌లు చేయించుకోగా, క‌రోనా బారిన ప‌డిన‌ట్లు నిర్ధార‌ణ అయింది. కొవిడ్ -19 ప‌రిస్థితుల‌కు సంబంధించి ప్ర‌తి రోజు రాత్రి 8:30 గంట‌ల‌కు డాక్ట‌ర్ల‌తో స‌మీక్ష జ‌రుపుతాన‌ని ప్ర‌క‌టించారు.

కాగా,  దేశంలో గత వారం రోజులుగా మూడు లక్షలకుపైగా మంది కరోనా బారినపడుతున్నారు. వరుసగా రెండో రోజూ మూడు వేలకుపైగా మరణాలు నమోదయ్యాయి. రోజువారీ కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతుండటంతో యాక్టివ్‌ కేసులు కూడా పెరిగిపోతున్నాయి. దీంతో దేశంలో యాక్టివ్‌ కేసులు 30 లక్షలకుపైగా ఉన్నాయి.

దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 3,79,257 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,83,76,524కు చేరింది. ఇందులో 1,50,86,878 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారు.
మరో 30,84,814 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

 కొత్తగా 3,645 మంది బాధితులు మరణించారు. ఇప్పటివరకు ఒక్కరోజులో ఇంత మంది బాధితులు చనిపోవడం ఇదే తొలిసారి. దీంతో దేశంలో కరోనా మరణాలు 2,04,8320కు చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 15,00,20,648 మందికి కరోనా టీకా పంపిణీ చేశామని తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా యాక్టివ్‌ కేసులు ఉన్న జాబితాలో భారత్‌ రెండో స్థానానికి చేరింది. అత్యధికంగా అమెరికాలో 60 లక్షల 80 వేల మందికిపైగా బాధితులు కరోనా చికిత్స పొందుతున్నారు. ఇక రెండో స్థానంలో భారత్‌లో 30 లక్షలకుపైగా కేసులు యాక్టివ్‌గా ఉండగా, బ్రెజిల్‌లో 10 లక్షకుపైగా కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక ఫ్రాన్స్‌లో యాక్టివ్‌ కేసులు 10 లక్షలకు చేరువలో ఉన్నాయి.