యువతులు, మహిళలు వినియోగించే శానిటరీ నేప్‌కిన్‌లను అతి తక్కువ ధరకు అందించడంతోపాటు, వాటి తయారీయంత్రాలను సైతం తక్కువ ధరకు అందిస్తున్న తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన అరుణాచలం మురుగానందం పేరు నోబెల్ బహుమతి రేసులోకి చేరింది. ఈ ఏడాది 208 మంది ప్రైవేటు వ్యక్తులతోపాటు 79 సంస్థల పేర్లు కూడా నోబెల్‌కు సిఫారసు చేసిన జాబితాలో ఉన్నాయి.
ఈ సందర్భంగా అరుణాచలం మురుగానందం ఆదివారం మీడియాతో మాట్లాడుతూ నోబెల్ పురస్కారానికి సిఫారసు చేసిన 208 మందిలో తన పేరు ఉండటం గర్వంగా ఉందని తెలిపారు. శానిటరీ నేప్‌కిన్‌లను సరసమైన ధరలకు తయారుచేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఐరోపా సహా 40 దేశాలకు వ్యాపింపచేశామని చెప్పారు. వీటిపై దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో శిక్షణ, అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టామని తెలిపారు.
పుదుచ్చేరిలోని అరవింద్ కంటి ఆస్పత్రికి చెందిన ఒక డీన్, అక్కడ పనిచేస్తున్న అమెరికన్ బృందాలు నోబెల్ శాంతి బహుమతి కోసం తన పేరును ప్రతిపాదించారని పేర్కొన్నారు. 24 గంటల్లోపే ఆ ప్రతిపాదన ఆమోదం పొందిందని స్పష్టం చేశారు. అందుకు తాను గర్వపడుతున్నానని చెప్పారు. అరుణాచలం మురుగనంతం స్వస్థలం తమిళనాడులోని కోయంబత్తూరు. ఆయన ఒక సామాజిక కార్యకర్త. రుతుస్రావంపై ఉన్న అపోహలను మహిళల్లో తొలగించేందుకు తన జీవితాన్ని దారబోశారు.
“పుదుచ్చేరిలోని అరవింద్ కంటి ఆస్పత్రికి చెందిన ఒక డీన్, అక్కడ పనిచేస్తున్న అమెరికన్ బృందాలు నోబెల్ శాంతి బహుమతి కోసం నా పేరును ప్రతిపాదించారు. ఒక రోజులోపే అది ఆమోదం పొందింది. నోబెల్ శాంతి బహుమతి కోసం ఎవరి పేరుని వారు గానీ, వారి స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు గానీ సిఫార్సు చేయలేరు. థర్డ్ పార్టీ ద్వారా నోబెల్ కమిటీకి ప్రతిపాదన వెళ్లాలి. నా పేరును నోబెల్ శాంతి ప్రైజ్‌కు సిఫార్సు చేశారని తెలిసి తొలుత నమ్మలేకపోయాను. నోబెల్ శాంతి బహుమతికి నామినీగా ఎంపికవ్వడంపై గర్వపడుతున్నాను” అని అరుణాచలం మురుగనంతం తెలిపారు.
మరోవైపు, అరుణాచలం జీవితం ఆధారంగా ‘ప్యాడ్‌మ్యాన్’ పేరిట ఓ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, సోనమ్ కపూర్, రాధికా ఆప్టే తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి ఆర్ బల్కీదర్శకత్వం వహించారు. 2018లో విడుదలైన ఈ సినిమా మంచి కలెక్షన్లను రాబట్టింది. సామాజిక సమస్యలను ఎత్తిచూపిన సినిమాల విభాగంలో ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డును కొల్లగొట్టింది. అలాగే సినీ విమర్శల నుంచి ప్రశంసలను అందుకుంది.

More Stories
21కి చేరిన ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు
మమతను ఓడించిన బిజెపి… గెలుపొందిన అధికార పార్టీ బిజెపినే!
నిశాంత్ కుమార్ ‘సద్భావ యాత్ర’ ప్రారంభం