* తమిళనాడులో స్టాలిన్, కేరళలో విజయన్ ఓటమి.. అస్సాంలో శర్మ, పుదుచ్చేరిలో రంగస్వామి విజయం
నాలుగు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలోని ధోరణులు చూస్తుంటే, మార్పు కోసం వీస్తున్న ఊపును తట్టుకుని నిలబడిన ఏకైక అధికార పార్టీ బీజేపీ అని స్పష్టమవుతోంది: అస్సాంలో ఆ పార్టీ అధికారాన్ని నిలబెట్టుకోనుంది. పుదుచ్చేరిలో ఆల్ ఇండియా ఎన్ ఆర్ కాంగ్రెస్‌తో దాని కూటమి తిరిగి అధికారంలోకి వస్తుంది.
డీఎంకే తిరిగి అధికారంలోకి వస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన తమిళనాడులో కూడా మార్పుకు ప్రజలు తీర్పు ఇచ్చారు. పైగా, బీజేపీ మిత్రపక్షమైన ఏఐఏడీఎంకే బలమైన పార్టీగా అనిలబడింది.
విజయ్ నేతృత్వంలోని కొత్త పార్టీ టీవీకే (తమిళగా వెట్రి కజగం) వందకు పైగా సీట్లతో అధికారం అంచున నిలబడ్డారు. రాష్ట్రంలోని మొత్తం 234 స్థానాల్లో ప్రస్తుతం ఆ పార్టీ 111 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.డీఎంకే కూటమి 70, ఎఐఎడిఎంకె కూటమి 55 సీట్లతో ఆ తర్వాత స్థానాలలో ఉన్నారు. పెరంబలూరు, త్రిచి తూర్పు నియోజకవర్గాల్లో విజయ్ ముందంజలో ఉండగా, ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌తో పాటు పలువురు డీఎంకే మంత్రులు కొలత్తూరులో వెనుకంజలో ఉన్నారు.
అస్సాంలో కూడా, ఎన్నికల ప్రచారం పొడవునా బీజేపీ తన ప్రత్యర్థుల కంటే స్పష్టంగా ముందున్నట్లు కనిపించినప్పటికీ, ఆ పార్టీ మరింత పురోగతి సాధించి, 126 మంది సభ్యులున్న అసెంబ్లీలో తన సీట్ల సంఖ్యను 99కి పెంచుకొనేటట్లు కనిపిస్తున్నది. కాంగ్రెస్ 24 సీట్లకు పరిమితం అవుతుంది.
బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పశ్చిమ బెంగాల్ కూడా ఆ పార్టీ వైపే మొగ్గు చూపుతుంది. బంగాల్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని నందిగ్రామ్ అభ్యర్థి సువేందు అధికారి తెలిపారు. ఓట్ షేర్‌లో సుమారు 45 శాతం ఓట్లు బిజెపికి పోలైనట్లు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. 294 స్థానాలు ఉన్న బెంగాల్‌లో ఎన్నికల సంఘం వెబ్‌సైట్ ప్రకారం 194 స్థానాల్లో బీజేపీ లీడింగ్‌లో ఉన్నది. తృణమూల్ కాంగ్రెస్ 94 స్థానాలతో రెండో స్థానంలో కొనసాగుతున్నది.
బెంగాల్‌లో ఇప్పటి వరకు జరిగిన కౌంటింగ్ ప్రకారం బీజేపీకి 45.07 శాతం ఓట్లు పోలైనట్లు తెలుస్తోంది. పార్టీ పరంగా ఓట్ షేర్‌లో తృణమూల్ కాంగ్రెస్ రెండో స్థానంలో ఉన్నది. ఆ పార్టీకి కూడా భారీగానే ఓట్లు పడ్డాయి. ఓట్ షేర్‌లో తృణమూల్‌కు 40.93 శాతం ఓట్లు పడినట్లు తెలుస్తోంది. తమ పార్టీ ఆధిక్యంలో దూసుకుపోవడంతో బీజేపీ శ్రేణులు కోల్‌కతాలోని బీజేపీ కార్యాలయం వెలుపల రంగులు పూసుకుంటూ సంబరాలు చేసుకున్నారు.
ఇక, కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి 100కు మించి సీట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఎల్డిఎఫ్ 34 సీట్లకు పరిమితమయింది. ఎన్డీయే సహితం 2 సీట్లకు పరిమితం అవుతుంది. మెజారిటీ మార్కును అధిగమించడంతో, తిరువనంతపురంలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
డీఎంకే ఓటమిని బీజేపీ స్వాగతిస్తున్నప్పటికీ, దక్షిణాదిలో ఆ పార్టీకి గట్టి పోటీ ఎదురవుతుందని ఫలితాలు సూచిస్తున్నాయి. కేరళలో మార్పు ఊపు కాంగ్రెస్‌కు అనుకూలించినట్లు కనిపిస్తుండగా, తమిళనాడులో టీవీకే లబ్ధి పొందింది. కోయంబత్తూరు, నాగర్‌కోయిల్ వంటి కీలక నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు వెనుకబడి ఉండగా, ఆ పార్టీ కేవలం 2 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది.
పశ్చిమ బెంగాల్, అస్సాంలో బీజేపీ విజయాలు సాధిస్తుందని ట్రెండ్స్ సూచిస్తున్న నేపథ్యంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం సాయంత్రం న్యూఢిల్లీలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించనున్నారు. గత ఎన్నికల విజయాల తర్వాత అనుసరిస్తున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, ఆయన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం కూడా ఉంది.

More Stories
21కి చేరిన ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు
స్టాక్ మార్కెట్లలో ఎన్నికల ఫలితాల జోష్
నోబెల్ శాంతి బహుమతికి ‘ప్యాడ్‌మ్యాన్’ అరుణాచలం పేరు