కేంద్రాన్ని బద్నామ్‌ చేయడమే కేసీఆర్‌ లక్ష్యం

కరోనా నియంత్రణలో చేతులెత్తేసిన సీఎం కేసీఆర్‌, కేంద్రాన్ని బద్నామ్‌ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ చేతగానితనాన్ని కేంద్రంపై నెడుతున్నారని విమర్శించారు.
 
 రాజకీయ కోణంతో కేంద్రాన్ని బద్‌నామ్‌ చేస్తే వారి గొయ్యి వారే తవ్వుకున్నట్లు అవుతుందని సంజయ్ హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు మరణిస్తుంటే సీఎం కనీసం సమీక్ష కూడా నిర్వహించకుండా ఫాంహౌ్‌సలో ఉండిపోయారని మండిపడ్డారు.
 
 ‘‘వ్యాక్సిన్‌ వేసుకోండి అని సీఎం కేసీఆర్‌ ఇప్పటివరకు పిలుపునిచ్చారా? అసలు కేసీఆర్‌తో పాటు మంత్రులు వ్యాక్సిన్‌ తీసుకున్నారా? ప్రధాని మోదీకి ఎక్కడ పేరు వస్తుందోనన్న రాజకీయ దురుద్దేశంతో కేంద్ర పథకాలను రాష్ట్రంలో అమలు చేయడం లేదు’’అని ధ్వజమెత్తారు. 
 
కరోనా బాధితులు, మరణాల సంఖ్యను రాష్ట్ర ప్రభుత్వం తక్కువ చేసి చూపించడం వల్లే ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగిపోయి, భయానక వాతావరణానికి దారి తీసిందన్నారు. కరోనా మరణాలన్నీ ప్ర భుత్వ హత్యలేనని ఆరోపించారు.  కరోనాను ఆరోగ్యశ్రీలో ఎందుకు చేర్చడంలేదు? కేంద్రమే వ్యాక్సిన్‌ను ఉచితంగా ఇస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం రూ.2500కోట్లు దేనికి కేటాయించినట్లు అని ప్రశ్నించారు.
 
‘‘ఈనెల 24వ తేదీ నుంచి ప్రతిరోజూ 430 టన్నుల ఆక్సిజన్‌ తెలంగాణకు వస్తోంది. వెంటిలేటర్లు, వ్యాక్సిన్‌, మందులు అన్నీ కేంద్రమే ఇస్తోంది. మరి మీరేం ఇస్తున్నారు. కేంద్రాన్ని బద్‌నాం చేయడం తప్ప’’ అని ధ్వజమెత్తారు