ధైర్యంగా ఎదుర్కొందాం… ఆందోళన అవసరం లేదు

సమాచారభారతి కోవిడ్ అవగాహన కార్యక్రమంలో డాక్టర్ల సూచనలు, సలహాలు

శుభ్రత పాటించడం, మాస్క్, సానిటైజర్ వాడకం , భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కోవిడ్ బారిన పడకుండా ఉండవచ్చని, ఒకవేళ వ్యాధి వచ్చినా సులభంగా బయటపడవచ్చని కోవిడ్ గురించి సమాచారభారతి ఏర్పాటు చేసిన ఆన్ లైన్ అవగాహన కార్యక్రమంలో డాక్టర్లు సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ వైద్యులు డా. వేద్ ప్రకాష్, డా. మారుతి శర్మ విలువైన సమాచారంతోపాటు, పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఫేస్ బుక్ ద్వారా ప్రసారమైన ఈ కార్యక్రమాన్ని 6వేలమందికి పైగా వీక్షించారు.

ధర్మానికి నాలుగు పాదాలలో శౌచం(శుభ్రత)ఒకటని, ఇది పాటిస్తే ఎలాంటి వ్యాధులు దరిచేరవని డా. మారుతి శర్మ అన్నారు. ప్రతి రోజు క్రమం తప్ప‌కుండా వ్యాయామం, సూర్య‌న‌మ‌స్కా‌రాలు చేయడం, కనీసం 20 నిమిషాలు ఎండలో నిలబడటం, సాధారణ, పౌష్టిక ఆహారం తీసుకోవడం వంటివి పాటిస్తే సరిపోతుంద‌ని, ఆందోళనకు గురికాకుండా, అలాగని నిర్లక్ష్యం వహించకుండా ఉండడమే ముఖ్యమని ఆయన అన్నారు. జలుబు, గొంతునొప్పి వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయరాదని అన్నారు. వ్యాధి లక్షణాలు కనిపించినవారు మిగిలినవారి నుంచి భౌతిక దూరం పాటించడం చాలా ముఖ్యం. వ్యాధి లక్షణాలు కనిపించినవారు ఆక్సీమీటర్ ద్వారా శరీరంలో ఆక్సిజన్ స్థాయిని చూసుకోవాలని, 93,90 వరకు రీడింగ్ ఉంటే ఫరవాలేదని, అంతకంటే తగ్గితే జాగ్రత్తపడాలని సూచించారు. ఎక్కువగా ఉపయోగించే చేతి మధ్యవేలుకు ఆక్సీమీటర్ పెట్టుకుని, ఒక నిముషం తరువాత రీడింగ్ తీసుకోవాలని చెప్పారు. శరీరమే గొప్ప వ్యవస్థ అని, అందుకని అనవసరంగా యాంటీబయాటిక్ మందులు వాడే అవసరం లేదని ఆయన సూచించారు.

కార్యక్రమంలో పాల్గొన్న మరొక వైద్యనిపుణులు డా. వేద్ ప్రకాష్ మాట్లాడుతూ రెండు రోజులపాటు ఏదైనా అనారోగ్యం ఉంటే వెంటనే మిగిలినవారితో భౌతిక దూరం పాటించడం, వైద్యులను సంప్రదించడం వంటివి చేయాలని సూచించారు. ఇలా `దో దీన్ – దో కామ్’ అనే పద్దతి ద్వారా ఈ అంటువ్యాధి వ్యాపించకుండా నివారించవచ్చని అన్నారు. వాక్సిన్ ల గురించి మాట్లాడుతూ మనదేశంలో తయారైన రెండు వ్యాక్సిన్ లలో ఏదైనా సురక్షితమైనదేనని, అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ వెంటనే వేయించుకోవాలని సూచించారు. వ్యాక్సిన్ 70, 80శాతం వరకు వ్యాధిని నివారిస్తుందని చెప్పారు. గర్భిణులు, బాలింతలు తప్ప అందరూ వాక్సిన్ తీసుకోవచ్చును.

అలాగే గతంలో ఏవైనా వాక్సిన్ లేదా ఇంజ‌క్ష‌న్‌ లు తీసుకున్నప్పుడు తీవ్రమైన ఇబ్బందులు కలిగినవారు కూడా వైద్యుల సలహా మేరకే వ్యాక్సిన్‌ తీసుకోవాలని చెప్పారు. వ్యాధి లక్షణాలు ఉన్నవారు రెండవ దశలో అవసరమైతే ఆక్సిజన్ తీసుకోవడం, ప్రత్యేక సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే స్టెరాయిడ్ లు వాడటం, రక్త సంబంధ సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే ప్రత్యేక మందులు తీసుకోవడం చేయాలని సూచించారు. రెమెడిసివిర్ వంటి మందులు అవసరమేలేదని, ఈ మందులు ఇంకా పరీక్ష దశలోనే ఉన్నాయని స్పష్టం చేశారు. ప్లాస్మా వైద్యం కూడా అవసరం లేదని అన్నారు.

పాలిచ్చే తల్లులు వ్యాధి సోకినా నిరభ్యంతరంగా తమ పిల్లలకు పాలు ఇవ్వవచ్చని ఇద్దరు నిపుణులు స్పష్టం చేశారు. ఋతుకాలంలో ఉన్న మహిళలు కూడా వాక్సిన్ తీసుకోవచ్చని తెలిపారు.

భయాందోళనలకు గురికాకుండా, పౌష్టికాహారం తీసుకుంటూ, యోగా, ప్రాణాయామం, సూర్యనమస్కారాలు వంటి వ్యాయామాలు క్రమం తప్పకుండా చేసేవారు కోవిడ్ బారిన పడకుండా ఉంటారని, ఒకవేళ పడినా త్వరగా కోలుకుంటారని వైద్యులు స్పష్టంచేశారు. అనంత‌రం సేవాభారతి నిర్వహిస్తున్న కోవిడ్ సేవా కార్యక్రమాల గురించి సేవా భార‌తి తెలంగాణ కార్య‌ద‌ర్శి ప్రభల రామ్మూర్తి గారు వివరించారు. ప్ర‌స్తుతం సేవాభార‌తి తెలంగాణ ఆధ్వ‌ర్యంలో కోవిడ్ హెల్ప్ లైన్ సెంట‌ర్‌ను ఏర్పాటు చేసిన‌ట్టు తెలిపారు. కరోనా ల‌క్ష‌ణాలున్న వారు ఎవ‌రైనా 040 4821 3100 కు కాల్ చేసి వైద్యుల‌ స‌ల‌హాలు, సూచ‌న‌లు పొంద‌వచ్చ‌ని ఆయ‌న తెలిపారు.