కోవిడ్ స‌హాయ‌క చ‌ర్య‌ల్లో ఆర్‌.ఎస్‌.ఎస్ స్వ‌యం సేవ‌కులు

దేశంలో క‌రోనా రెండో ద‌శ తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందుతుంది. వైర‌స్ బారిన ప‌డి అనేక మంది ప్ర‌జ‌లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోగులు ఎక్కువ అవుతుండ‌డంతో దేశంలోని ప‌లు ఆస్ప‌త్రుల్లో వైద్య, ఆరోగ్య‌ సిబ్బంది, ప‌డ‌క‌ల‌ కొర‌త ప్ర‌ధాన స‌మ‌స్య‌గా మారింది. ఈ నేప‌థ్యంలో రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క్ సంఘ్ త‌మ వంతు సాయం చేయ‌డానికి ముందడుగు వేసింది. గ‌తేడాది కరోనా స‌మ‌యంలో కూడా ఆర్‌.ఎస్‌.ఎస్, సేవా భార‌తి ఆధ్వ‌ర్యంలో దేశ వ్యాప్తంగా అనేక సేవా కార్య‌క్ర‌మాలు చేసింది. క‌రోనా మ‌ళ్లీ విజృంభించ‌డంతో స్వ‌యం సేవ‌కులు త‌మ సేవా క‌ర్త‌వ్యాన్ని ప్రారంభించారు.

మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని భూపాల్‌లో క్వారెంటైన్ కేంద్రం
మధ్యప్రదేశ్‌లో ఎప్పటికప్పుడు పెరుగుతున్న కరోనా దృష్ట్యా భోపాల్ ఆస్ప‌త్రుల‌లో ప‌డ‌క‌ల కొర‌త వ‌ల్ల సంఘ్ కార్యకర్తలు భోపాల్ గాంధీనగర్ లోని సేవా భారతి ఆశ్రమంతో పాటు శివాజీ నగర్, నారియ‌ల్ ఖేడా, కొత్రాలోని సరస్వతి శిశు మందిరాల‌లో నాలుగు ఐసోలేష‌న్ కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు.  ప్రస్తుతం 70 మందికి ఇక్కడ ఏర్పాట్లు చేశారు. అవసరమైతే ఈ కేంద్రాలలో సుమారు 200 మంది ఉండ‌టానికి ఏర్పాట్లు ఉన్నాయి. క్వారెంటైన్‌లో ఉంటున్న వారికి ఉచిత ఆహారం కూడా అందిస్తున్నారు. వారికి ఎప్పటికప్పుడు మెడికల్ కౌన్సెలింగ్ కూడా ఇస్తున్నారు.  అలాగే భోపాల్‌లోని దిగంబార్ జైన్ సమాజ్ ట్రస్ట్, శ్రీ గుజరాతీ సమాజ్‌లు కూడా తమ కమ్యూనిటీ భవనాలను, ధర్మశాలలను  క్వారైంటైన్ కేంద్రాలుగా మార్చారు.

 

అలాగే భోపాల్‌, ఇత‌ర ప్రాంతాల్లో ఆర్.‌ఎస్.‌ఎస్ స్వయంసేవకులు కరోనా వ్యాక్సిన్ పై అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. వ్యాక్సిన్ ప‌ట్ల అవ‌గాహ‌న పెంచి వ్యాక్సినేష‌న్ శాతాన్ని పెంచ‌డానికి స్వ‌యం సేవ‌ల‌కులు కృషి చేస్తున్నారు. మధ్య ప్ర‌దేశ్‌లోని నీముచ్ న‌గ‌ర్ మునిసిపల్ కాలేజీలో ఏర్పాటు చేసిన క‌రోనా టీకా శిబిరంలో క‌ళాశాల సిబ్బందితో క‌లిసి ఆర్‌.ఎస్‌.ఎస్ స్వ‌యం సేవ‌కులు ఆరోగ్య అధికారి సహకారంతో రిజిస్ట్రేషన్, ధృవీకరణ ప్ర‌క్రియ‌లో స‌హాయం చేస్తున్నారు.

భోపాల్ లోని గోవిందపుర బస్తీలో సంఘ స్వ‌యం సేవ‌కులు జనజాగ‌ర‌న్ అభియాన్ ద్వారా ఇద్దరిద్ద‌రుగా ఇండ్ల‌లోకి వెళ్లి రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవ‌డానికి ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. అలాగే ప్ర‌జ‌లు టీకాలు తీసుకునేలా వారిలో చైత‌న్యాన్ని పెంపొందిస్తున్నారు.
భోపాల్‌లోని సాగర్ గ్రూప్ ఆఫ్ ఇంజ‌నీరింగ్ క‌ళా‌శాల‌లో 400 పడకల ఐసోలేషన్ వార్డును ఆర్‌.ఎస్‌.ఎస్ స్వ‌యం సేవ‌కుల స‌హాకారంతో ఏర్పాటు చేశారు. సంఘ స్వ‌యం సేవ‌కులే ఈ ఐసోలేష‌న్‌లో పూర్తి ఏర్పాట్లను నిర్వ‌హిస్తున్నారు. భోపాల్ మహావీర్ నగర్ లోని జేపీ హాస్పిటల్ లో 1250 మంది రోగులకు, వారి కుటుంబ స‌భ్యుల‌కు ఆర్‌.ఎస్‌.ఎస్ స్వ‌యం సేవ‌కులు ఆహారాన్ని పంపిణీ చేశారు.

ఆర్‌.ఎస్‌.ఎస్, జ‌న క‌ళ్యాణ స‌మితి ” సమర్త్ భారత్ ” పేరుతో 450 ప‌డ‌క‌ల కోవిడ్ కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. పూణే మున్సిప‌ల్ స‌హ‌కారంతో కార్వెనగర్‌లోని మహర్షి కార్వే స్ట్రీ శిక్షా సమస్థ వద్ద ఉన్న బయా కార్వే హాస్టల్‌లో ఈ కోవిడ్ కేర్ సెంటర్ ప్రారంభించారు.

సూర‌త్ న‌గ‌రంలో ప్రభుత్వ ఆసుస్ప‌త్రుల్లో సిబ్బంది కొరత కారణంగా, ఆర్‌ఎస్‌ఎస్ స్వ‌యం సేవ‌ల‌కులు స్వ‌యంగా పీపీఈ కిట్లు ధ‌రించి క‌రోనా సోకిన వారికి ఆహారాన్ని అంద‌జేయ‌డానికి ఏర్పాట్లు చేశారు. బజరంగ్ దళ్ కార్‌ఎక‌ర్త‌లు కూడా త‌మ వంతు సేవ చేస్తున్నారు. వీరితో పాటు నగరంలోని ఇతర సేవా సంస్థలు, సామాజిక సంస్థలు కూడా సూర‌త్ సివిల్ ఆసుపత్రిలో సేవలను అందించడానికి ముందుకు వస్తున్నాయి.

ఇండోర్‌ ఆర్‌.ఎస్‌.ఎస్ ఆధ్వ‌ర్యంలో 4 ఆక్సిజన్ ప్లాంట్లు, 6000 ప‌డ‌క‌లతో కూడిన‌ రెండో అతిపెద్ద కోవిడ్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. క‌రోనా రోగుల‌కు అన్నిర‌కాల స‌దుపాయాల‌తో పాటు ఉచిత ఆహారాన్ని స్వ‌యంసేవ‌కులు అందిస్తున్నారు.

కాన్పూర్ లో క‌రోనా పెరుగుతున్న దృష్ట్యా రోగుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌డం ఇబ్బందిగా మారింది. దీంతో రోగులను ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌డానికి ఆర్‌.ఎస్‌.ఎస్, రామ్‌లాలా ఆరోగ్య ధామ్ తో క‌లి‌సి ఒక అంబులెన్స్‌ను ప్రారంభించారు. డాక్టర్ ఉమేష్ పాలివాల్, డాక్టర్ ప్రవీణ్ ఈ అంబులెన్స్‌కు పూజ కార్య‌క్ర‌మాలు చేసి ప్రారంభించారు.

రాజ‌స్తాన్‌లోని జైపూర్ అంబబారిలో కోవిడ్ రోగుల కుటుంబాలకు సేవా భారతి ఉచితంగా వ‌స‌తి ఏర్పాట్ల‌ను చేస్తుంది. అలాగే ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని గోర‌ఖ్‌పూర్‌లో ఆర్‌.ఎస్‌.ఎస్ ఆధ్వ‌ర్యంలో 50 ప‌డ‌క‌ల ఐసోలేష‌న్ కేంద్రాన్ని ప్రారంభించారు.

కేర‌ళ‌లో ఆసుపత్రి కార్యదర్శి ఆధ్వ‌ర్యంలో కోవిడ్ నిబంధ‌న‌ల‌ను పాటిస్తూ క‌రోనాతో చ‌నిపోయిన వారికి  సేవా భారతి కార్యకర్తలు దహన సంస్క‌రాలు చేస్తున్నారు. ఢిల్లీలోని అక్ష‌ర‌ధామ్ ఆలయంలోని కోవిడ్ కేర్ సెంటర్‌లో సేవా భారతి కార్య‌క‌ర్త‌లు ఆక్సిజన్ సిలిండర్ల అమరికలో నిమగ్నమయ్యారు. మ‌హారాష్ట్రలోని నారాయణ నగర్ బస్తీ నుండి మిస్రోడ్ శ్మశానవాటికకు అంత్యక్రియల నిమిత్తం క‌ట్టెల‌ను ఆర్‌.ఎస్‌.ఎస్ స్వ‌యం సేవ‌కులు స‌ర‌ఫ‌రా చేశారు.

తెలంగాణ, భాగ్య‌న‌గ‌రంలోని అన్నాజీగూడ‌లో ఉన్న రాష్ట్రీయ విద్యా కేంద్రంలో 500 ప‌డ‌క‌ల‌తో కోవిడ్ కేర్ సెంట‌ర్‌ను ఏర్పాటు చేశారు. అక్క‌డున్న వ్యాదిగ్ర‌స్తుల‌కు వైద్య స‌ల‌హాలు, సూచ‌న‌ల‌తో పాటు, ఉచిత ఆహారాన్ని సేవాభార‌తి అందించ‌నుంది. అలాగే తెలంగాణలోని గాంధీ ఆస్ప‌త్రిలో జనహిత సేవా ట్రస్టు కు చెందిన వాలంటీర్లు ఆస్ప‌త్రిలోని వార్డుల్లో రోగుల వివ‌రాలు సేక‌రిస్తూ వైద్య సిబ్బందికి స‌హ‌క‌రిస్తున్నారు.

గుజరాత్‌ కర్నావతిలోని కోవిడ్ కేర్ సెంటర్‌లో ఆర్‌.ఎస్‌.ఎస్ కార్య‌క‌ర్త‌లు సేవా ప‌నుల్లో నిమ‌గ్న‌మ‌య్యారు. అంబులెన్సు సిబ్బందికి ఆహార పొట్లాలు అంద‌జేయ‌డం, వైద్య సిబ్బందికి స‌హాకారం అందిచ‌డం వంటి సేవా కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు. అలాగే వ్యాక్సిన్ రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ‌ను నిర్వ‌హించ‌డంలో కూడా స్వ‌యం సేవ‌కులు ఆరోగ్య సిబ్బందికి సాయం చేస్తున్నారు.

ఆర్‌.ఎస్‌.ఎస్ తో పాటు దేశంలోని వివిధ ధార్మిక సంస్థ‌లు కూడా సేవా కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టాయి. గుజ‌రాత్‌లోని శ్రీ స్వామి నారాయ‌ణ ఆల‌యంలో 300 ప‌డ‌క‌ల కోవిడ్ ఐసోలేష‌న్ కేంద్రాన్ని ఆల‌య క‌మిటీ ఏర్పాటు చేసింది.