యూపీలో ఏప్రిల్ 30 నుంచి మే 4 వ‌ర‌కూ సంపూర్ణ లాక్‌డౌన్

క‌రోనా వైర‌స్ సెకండ్ వేవ్ విరుచుకుప‌డ‌టంతో కేసుల తీవ్ర‌త‌తో ఉక్కిరిబిక్కిర‌వుతున్న ఉత్త‌ర్ ప్ర‌దేశ్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. మహ‌మ్మారి క‌ట్ట‌డికి ఈనెల 30 సాయంత్రం నుంచి మే 4 ఉద‌యం వ‌ర‌కూ సంపూర్ణ లాక్‌డౌన్ అమ‌ల‌వుతుంద‌ని యూపీ ప్ర‌భుత్వం గురువారం వెల్ల‌డించింది.

కేసుల పెరుగుద‌ల‌తో ప‌లు రాష్ట్రాలు వారాంతాల్లో లాక్‌డౌన్, నైట్ క‌ర్ఫ్యూ వంటి ప‌లు నియంత్ర‌ణ‌ల‌ను అమ‌లు చేస్తున్నాయి. మ‌రోవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను ముమ్మ‌రం చేయ‌డంతో పాటు ఆక్సిజ‌న్ బెడ్లు, మందుల కొర‌త‌ను అధిగ‌మించేందుకు చ‌ర్య‌లు చేప‌డుతున్నాయి.

మరోవంక, క‌రోనా తీవ్ర‌త దృష్ట్యా గోవాలో ఇవాళ రాత్రి 7 గంట‌ల నుంచి మే 3వ తేదీ ఉద‌యం వ‌ర‌కు లాక్‌డౌన్ అమ‌లు చేయ‌నున్నారు. ఈ మేర‌కు ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ప్ర‌మోద్ సావంత్ మీడియాకు వెల్ల‌డించారు. అయితే, అత్య‌వ‌స‌ర సేవ‌లు, వివిధ‌ పరిశ్ర‌మ‌లకు లాక్‌డౌన్ నుంచి మిన‌హాయింపు ఇస్తున్న‌ట్లు తెలిపారు. 

అదే విధంగా అత్య‌వ‌స‌ర వ‌స్తువుల ర‌వాణా కోసం రాష్ట్ర‌ స‌రిహ‌ద్దులు తెరిచే ఉంటాయ‌ని సీఎం వెల్ల‌డించారు. కానీ, ప్ర‌జార‌వాణా వ్య‌వ‌స్థ‌ను నిలిపివేస్తామ‌న్నారు. క్యాషినోలు, హోట‌ళ్లు, ప‌బ్‌లు మూసే ఉంటాయ‌ని చెప్పారు. వ‌ల‌స కూలీలు ఎవ‌రూ కూడా రాష్ర్టాన్ని వ‌దిలిపెట్టి పోవ‌ద్దు అని సీఎం సావంత్ విజ్ఞప్తి చేశారు.

క‌రోనా మ‌హ‌మ్మారి పంజా విసురుతున్న వేళ ఉత్త‌రాఖండ్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ ఏడాది చార్‌ధామ్ యాత్ర‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. కేవలం ఆ నాలుగు ఆల‌యాల్లో ఉండే పూజారులు మాత్ర‌మే ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హిస్తార‌ని ముఖ్య‌మంత్రి తీర‌థ్ సింగ్ రావ‌త్ వెల్ల‌డించారు. మే 14 నుంచి ఈ యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది.